Israel: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు అందుకే..: నెతన్యాహు

తాము మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో శాంతిని విస్తరింపజేసేందుకు యత్నిస్తుంటే.. హమాస్‌ శాంతికి విఘాతం కలిగించేందుకు దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

Published : 20 Oct 2023 01:58 IST

జెరూసలెం: మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో శాంతికి విఘాతం కలిగించడమే లక్ష్యంగా హమాస్‌ (Hamas) దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Netanyahu) వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఈక్రమంలోనే నెతన్యాహు, రిషి సునాక్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. తాము మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో శాంతిని విస్తరింపజేస్తుంటే.. దాన్ని మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ నాశనం చేసేందుకు యత్నిస్తోందని.. అందుకే, ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రతిదాడులను ఉద్దేశించి చెప్పారు. 

గాజా నుంచి పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌ చేసిన దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీ ప్రజలు మృతి చెందారని రిషి సునాక్‌కు నెతన్యాహు వివరించారు. ఇదో సుదీర్ఘమైన యుద్ధమని.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకి మద్దతు కొనసాగించాలని ఈ సందర్భంగా రిషి సునాక్‌ను నెతన్యాహు కోరారు. దీనిపై స్పందించిన రిషి సునాక్‌.. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ పర్యటన ముగిసిన వెంటనే రిషి సునాక్‌ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. 

మరోవైపు అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 3,785 మంది పాలస్తీనా ప్రజలు మరణించారని, 12,493 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో 1,524 మంది చిన్నారులు.. వెయ్యి మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. ఆస్పత్రుల్లో మందుల కొరత ఉందని, అంతర్జాతీయ సంస్థలు సత్వరమే సాయం చేయాలని కోరుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు