Palestine: హమాస్‌ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవు: మహమూద్‌ అబ్బాస్‌

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్ల దుశ్చర్యలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అయితే, హమాస్‌ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని ఆదేశ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ స్పష్టం చేశారు.

Published : 16 Oct 2023 06:20 IST

హెబ్రాన్‌: ఇజ్రాయెల్‌(Israel) పై పాలస్తీనా(Palestine) కు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌ (Hamas) దాడుల్ని అనేక దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్‌ మిలిటెంట్లు అక్కడి ప్రజలను అతి క్రూరంగా చంపేశారు. ఈ ఘటనలపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ (mahmoud abbas) స్పందించారు. హమాస్‌ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని స్పష్టం చేశారు. హమాస్‌ చేసే దురాగతాలతో పాలస్తీనా ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. కేవలం పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(అధికార పార్టీ) విధివిధానాలే దేశాన్ని ప్రతిబింబిస్తాయని వెల్లడించారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పర దాడుల్ని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఖండించారు. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను విడుదల చేయాలని అబ్బాస్‌ కోరారు. 

యుద్ధం వల్ల పౌరులు.. పిల్లలు మూల్యం చెల్లించుకుంటున్నారు: టెడ్రోస్‌ అథనామ్

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనామ్ మాట్లాడుతూ.. హమాస్‌ దాడులు అతి క్రూరమైనవి. ప్రతి ఒక్కరూ ఈ దాడుల్ని ఖండించాల్సిందే. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ ప్రజల్ని హమాస్‌ వెంటనే విడిచిపెట్టాలని కోరారు. అలాగే, ఇజ్రాయెల్‌ దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు, చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో విధ్వంసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఉత్తర గాజా నుంచి లక్షలమంది దక్షిణ గాజాకి తరలివెళ్తున్నారని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గాజా స్ట్రిప్‌లో వెంటనే విద్యుత్‌, నీటి సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజలకు ఆహారం, మందులు పంపిణీ చేసేందుకు అనుమతించాలని టెడ్రోస్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని