Israel: టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడిన హమాస్‌

గాజాలో ఇటీవల దూకుడు పెంచిన హమాస్‌.. ఆదివారం ఏకంగా ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై రాకెట్ల వర్షం కురిపించింది.

Updated : 27 May 2024 06:20 IST

భారీ స్థాయిలో రాకెట్ల ప్రయోగం
ఇజ్రాయెల్‌ రాజధానిలో మోగిన సైరన్లు

దేర్‌ అల్‌ బలాహ్‌: గాజాలో ఇటీవల దూకుడు పెంచిన హమాస్‌.. ఆదివారం ఏకంగా ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. భారీగా పొగలు వస్తున్న దృశ్యాలూ కనిపించాయి. టెల్‌ అవీవ్‌లో సైరన్లు మోగడం ఐదు నెలల కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా టెల్‌ అవీవ్‌ దిశగా జనవరిలో హమాస్‌ రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడికి సంబంధించి నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. టెల్‌ అవీవ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలపైనా హమాస్‌ రాకెట్ల దాడి చేసిందని ఇజ్రాయెల్‌ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ గాజాలోని రఫా నుంచే ఈ రాకెట్లను హమాస్‌ ప్రయోగించి ఉంటుందని ఐడీఎఫ్‌ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌ భీకరంగా విరుచుకుపడినా, సుదీర్ఘ శ్రేణి రాకెట్లను ప్రయోగించే సత్తా ఇంకా తమకు ఉందని ఈ దాడితో హమాస్‌ నిరూపించింది. ఇటీవల కాలంలో హమాస్‌కు చెందిన అల్‌ కసమ్‌ బ్రిగేడ్స్‌ దూకుడు పెంచింది. ఈ రాకెట్ల దాడిని తామే చేశామని టెలిగ్రామ్‌ ఛానల్‌లో ఆ బ్రిగేడ్‌ ప్రకటించింది. రఫాపై ఇజ్రాయెల్‌ దృష్టి కేంద్రీకరించిన వేళ.. ఉత్తర గాజాలో జబాలియాలో ఇటీవల హమాస్‌ క్రియాశీలమైంది. గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తోంది. జబాలియాలో ఓ ఇజ్రాయెలీ సైనికుడిని తాము అపహరించామని ఆదివారం హమాస్‌ ప్రకటించింది. టెల్‌ అవీవ్‌ మాత్రం ఈ వార్తను ఖండించింది. మరోవైపు ఈజిప్టు నుంచి ఐక్యరాజ్యసమితి మానవతా సాయం ఆదివారం గాజాలోకి ప్రవేశించింది. కెరెమ్‌ షాలోమ్‌ క్రాసింగ్‌ ద్వారా 200 ట్రక్కులు గాజాలోకి వెళ్లాయని ఈజిప్టు రెడ్‌ క్రెసెంట్‌ సంస్థ తెలిపింది. ఈ నెల ఆరో తేదీన రఫా క్రాసింగ్‌ను ఇజ్రాయెల్‌ ఆక్రమించడంతో గాజాకు మానవతా సాయం ఆగిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని