Hamas: ‘మీరే ఇజ్రాయెల్‌ను అడ్డుకోగలరు’.. పాక్‌ మద్దతు కోరిన హమాస్‌..!

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్‌ భీకర దాడులతో గాజా ఛిద్రమవుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌ నేతలు పాక్‌ మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated : 07 Dec 2023 13:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) ఆర్థిక సమస్యలతో విలవిల్లాడుతోంది. సొంత దేశంలో జరుగుతున్న వరుస ఉగ్రదాడులనే నిలువరించలేకపోతోంది. అలాంటి పాక్‌.. ఇప్పుడు గాజా నగరంపై ఇజ్రాయెల్‌(Israel) చేస్తున్న దాడిని అడ్డుకోగలదట. ఇజ్రాయెల్‌ను ఆపడం ‘ధైర్యవంతమైన’ పాక్‌కే సాధ్యమట. ఈ విషయాన్ని పాక్‌కు చెందిన ఓ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్‌ దళాల మధ్య భీకర పోరు(Israel-Hamas Conflict) సాగుతోంది. ఈ క్రమంలో యుద్ధంలో కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్‌ దళాలు హమాస్‌ గాజా ప్రభుత్వ అధిపతి యాహ్యా సిన్‌వార్ ఇంటిని చుట్టుముట్టాయి. గాజాలోని ఖాన్‌యూనిస్‌ నగరం నడిబొడ్డుకు తమ దళాలు చేరుకొన్నాయని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశంలో ప్రకటించారు. అతడు ఆ ఇంటి నుంచి ఇప్పటికే పారిపోయి ఉండొచ్చని.. కానీ, తమ దళాలు త్వరలోనే అతడిని చేరుకొంటాయన్నారు.  

మరోవైపు సొరంగాల్లో నక్కిన హమాస్‌ బలగాలు బయటకు వచ్చి పోరాడుతున్నాయని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారి వెల్లడించారు. హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాలకు చెందిన నాయకత్వం ఆ నగరం నుంచే వచ్చిందని వెల్లడించారు.

అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?

హమాస్‌ను భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్న వేళ.. పాక్‌(Pakistan) మీడియా సంస్థ కథనం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం.. హమాస్‌కు చెందిన ఇస్మాయిల్ హనియా పాక్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆ దేశం మద్దతు కోరారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. ఇజ్రాయెల్‌కు పాకిస్థాన్‌ నుంచి ప్రతిఘటన ఎదురైతే.. ఈ క్రూర ఘర్షణ ఆగుతుందని వ్యాఖ్యానించారు. హనియాను ఉటంకిస్తూ ఈ మేరకు పాక్‌ మీడియా రాసుకొచ్చింది. గాజాలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించిన ఇస్మాయిల్.. ప్రస్తుతం ఖతార్‌ నుంచి హమాస్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.    

ఇదిలా ఉంటే.. ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతను పెంచింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు ఈ పోరు విస్తరించడంతో ప్రజలు భీతావహులై పోతున్నారు. ఇప్పుడు గాజా అంతటా పోరు విస్తరిస్తుండటంతో వారు మళ్లీ ఎక్కడికెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఉత్తర గాజాలోని గాజా సిటీ దాదాపుగా పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి ఇళ్లన్నీ దాడులతో నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలోనే అదే పరిస్థితి తలెత్తే అవకాశముందని పాలస్తీనీయులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు