Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్‌ హెచ్చరిక!

Israel-Hamas Conflict: బందీలను విడిపించడమే లక్ష్యంగా గాజాలో ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్‌. ఈ తరుణంలో హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చింది. 

Published : 11 Jun 2024 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాలో ఉద్ధృత పోరు కొనసాగుతోంది. ఇటీవల హమాస్‌ చెరలో ఉన్న నలుగురు బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ నిర్వహించిన ఆపరేషన్లలో స్థానికంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హమాస్‌ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెల్‌అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకొని వస్తున్నాయని భావిస్తే..బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.(Israel-Hamas Conflict)

గత ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. ఈక్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి గాజాకు తరలించారు. నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ చెబుతోంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో.. వారిని కాపాడటం టెల్‌అవీవ్‌కు సవాల్‌గా మారుతోంది. వారిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్లు వంటి వాటితో ఇజ్రాయెల్‌, అమెరికా నిఘా విభాగాలు, మిలిటరీ నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు పిలుపునిస్తూ.. అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతామండలి ఆమోదించింది. 14 ఓట్లు అనుకూలంగా రాగా.. రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఈ సంధి ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే హమాస్ నుంచి అంగీకారం రావాల్సి ఉంది. తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే హమాస్‌ వెల్లడించింది. ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది. దీనిని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల బందీలను విడిపించేందుకు చేసిన ఆపరేషన్ వీడియోలను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది.  



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని