Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్‌ దాడిలో 178 మంది మృతి

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరపడంతో శుక్రవారం 178 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Updated : 02 Dec 2023 03:32 IST

గాజా: కాల్పుల విరమణ(Ceasefire) ఆగిపోవడంతో గాజా(Gaza)లో మళ్లీ ఇజ్రాయెల్‌(Israel) బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్‌(Hamas) బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్‌ గ్రూప్‌ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్‌ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. 

అక్టోబర్‌ 24న ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం  జరగడంతో వారం రోజుల పాటు దాడులు చోటుచేసుకోలేదు. తొలుత నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అనంతరం బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. దీంతో ఇరువైపుల నుంచి దాడులు జరగలేదు. ఈ గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. కాల్పుల విరమణను ఇంకా కొన్నిరోజులపాటు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ మళ్లీ ప్రారంభమయ్యాయి. హమాస్‌ తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌  వైమానిక, భూతల దాడులకు దిగింది. దీంతో బందీల విడుదల ఆగిపోయింది. కాల్పులు మళ్లీ కొనసాగడంపై అమెరికా, ఐక్యరాజ్యసమితి స్పందించాయి. గాజాలో కాల్పులు ఆపాలని, కాల్పుల విరమణను పునరుద్ధరించాలని యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌, వైట్‌హౌస్‌ ఇరుపక్షాలను కోరాయి. మనవతాకోణంలో సహాయం చేసేందుకు ఇజ్రాయెల్‌, ఈజిప్ట్‌, ఖతార్‌ దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు యూఎస్‌ జాతీయ భద్రతా కౌన్సిల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. 

మరోవైపు హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయిన విషయాన్ని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొంది. ఒకరి మృతదేహాన్ని గుర్తించి ఇజ్రాయెల్‌కు తరలించామని తెలిపింది. ఇంకా హమాస్‌ బందీల్లో 136 మంది ఉన్నారని, వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డానియెల్‌ హగారీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ సమయంలో హమాస్‌ తమ చెరలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్‌ తమ దేశ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా వాసులను విడుదల చేసింది. అక్టోబర్‌ 7న హామాస్‌ ఇజ్రాయెల్‌పై దాడికి దిగి పెను విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఇజ్రాయెల్‌ గాజాలో వైమానిక దాడులకు దిగడంతో సుమారు 15,000 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని