Israel Hamas Conflict: గాజాలో యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే: హమాస్‌

Israel Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం ఆపితేనే తాము సంధికి వస్తామని హమాస్‌ తేల్చి చెప్పింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనబోమని పేర్కొంది.

Updated : 31 May 2024 10:03 IST

Israel Hamas Conflict | గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ (Hamas) వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ (Israel) యుద్ధం ఆపాలని షరతు విధించింది. అప్పటి వరకు తాము ఎలాంటి సంధి చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఒప్పందం కోసం యత్నిస్తున్న మధ్యవర్తులకు తెలియజేశామని గురువారం వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ (Israel), హమాస్‌ మధ్య సంధి కోసం ఈజిప్టు, ఖతార్, అమెరికాకు చెందిన ప్రతినిధులు గతకొన్ని నెలలుగా మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ఆ దిశగా జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సంధికి విముఖత వ్యక్తం చేశాయి. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్‌ చేసిన దాడి తీవ్ర ప్రాణనష్టానికి దారితీసిన తరుణంలో హమాస్‌ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఐరాస, అంతర్జాతీయ న్యాయస్థానం వారించినప్పటికీ.. ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఇజ్రాయెల్‌ మాత్రం పూర్తి విజయం సాధించే వరకు యుద్ధంపై వెనక్కి తగ్గేది లేదని పునరుద్ఘాటిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ హమాస్‌ను ఓడించే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రతినబూనుతోంది. బేషరతుగా బందీలను విడిచిపెట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గబోమని తేల్చి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు