Kate Middleton: క్యాన్సర్ నిర్ధరణ.. పిల్లలకు కేట్‌ ఏం చెప్పారంటే..?

ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమ గోప్యతకు సహకరించాలని ఆమె కోరారు. 

Updated : 23 Mar 2024 13:28 IST

లండన్: బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్(Kate Middleton) క్యాన్సర్‌(Cancer) బారినపడ్డారు. ఆమె తన ముగ్గురు పిల్లలకు ఆ విషయాన్ని ఎలా వెల్లడించారో  చెప్పారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా స్పందించారు.

కేట్‌ (Kate Middleton) శస్త్రచికిత్స చేయించుకున్నారని జనవరిలో ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం వెల్లడించింది. ఆ తర్వాతే క్యాన్సర్ బయటపడిందని, కిమో థెరపీ చేయించుకుంటున్నానని ఆమె చెప్పారు. ‘‘క్యాన్సర్ గురించి తెలియగానే షాక్‌కు గురయ్యా. మా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో మేం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. మాకు ఎదురైన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, దానిని చిన్నారులతో పంచుకోవడానికి సమయం పట్టింది. అప్పటికే శస్త్రచికిత్స చేయించుకోవడంతో  కోలుకొని, కిమో థెరపీ ప్రారంభించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా జార్జ్‌, చార్లట్‌, లూయిస్‌కు ప్రతిదీ సున్నితంగా వివరించాల్సి వచ్చింది. నేను క్షేమంగా ఉన్నానని, కోలుకుంటున్నానని వారికి భరోసా ఇచ్చాను.  ఈ క్లిష్ట పరిస్థితుల్లో విలియం నుంచి అందుతోన్న మద్దతు మరువలేనిది. మీరంతా మా మీద చూపిన ప్రేమ మాకు ఎంతో విలువైంది. ఈ చికిత్స పూర్తయ్యేవరకు మా గోప్యతకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.

2011లో వివాహం చేసుకున్న విలియం, కేట్‌లకు ముగ్గురు సంతానం. ఇప్పటికే బ్రిటన్‌ రాజు, విలియం తండ్రి ఛార్లెస్‌-3 క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శస్త్రచికిత్స తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఎన్నో వదంతులు వ్యాపించాయి. ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే స్పష్టత వచ్చింది.

స్పందించిన హ్యారీ, మేఘన్‌

క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నానని కేట్ చేసిన ప్రకటనపై విలియం సోదరుడు హ్యారీ, ఆయన సతీమణి మేఘన్‌ మెర్కల్ స్పందించారు. ‘కేట్ ఈ పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలి’ అని కోరుకున్నారు. బ్రిటన్ రాజకుటుంబ సభ్యులైన వీరు కొన్నేళ్ల క్రితం రాజరికపు విధుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. తర్వాత అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని