Ebrahim Raisi: అడవిలో కూలిన ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 20 May 2024 07:38 IST

అంతుచిక్కని రైసీ ఆచూకీ 
దట్టమైన అటవీప్రాంతంలో ముమ్మర గాలింపు
పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం
అదే లోహవిహంగంలో విదేశాంగ మంత్రి సహా మరికొందరు 
రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష
ఆయన కోసం ఇరాన్‌ అంతటా ప్రార్థనలు

దుబాయ్, టెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రైసీ క్షేమంగా తిరిగిరావాలని యావద్దేశం ప్రార్థనలు చేస్తోంది. దేశాధ్యక్షుడి జాడను గుర్తించేందుకు త్రివిధ దళాలు సహా పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇరాన్‌ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచదేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

డ్యాంల ప్రారంభోత్సవానికి వెళ్లి..

ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్‌ కలాసీ, ఖొదావరిన్‌ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు.

అనంతరం ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్‌ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్‌ పట్టణానికి హెలికాప్టర్‌లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న లోహవిహంగం ప్రతికూల వాతావరణం కారణంగా ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్‌ కూలిపోయిందని ఎక్కువ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్‌ ప్రభుత్వరంగ మీడియా మాత్రం ఆ లోహవిహంగం నేలను బలంగా తాకినట్లు మాత్రమే పేర్కొంది.

దట్టమైన అటవీ ప్రాంతం 

ప్రమాదం జరిగిన ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పర్వతాలతో కూడిన అటవీ ప్రాంతం. కొద్దిరోజులుగా అక్కడ భారీ వర్షాలు, పొగమంచు కురుస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. అయితే ఘటనాస్థలానికి చేరుకునేందుకు అవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా- రెస్క్యూ హెలికాప్టర్‌ కూడా అక్కడ ల్యాండ్‌ కాలేకపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు- ప్రమాద స్థలానికి సమీపంలో సాధారణ, ఎయిర్‌ అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. రైసీ ఉన్న హెలికాప్టర్‌లో కొందరు అధికారులు, భద్రతాసిబ్బంది కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు లోహవిహంగాలు సురక్షితంగా ల్యాండయ్యాయి. 

ఖమేనీ వారసుడిగా పేరు! 

రైసీ వయసు 63 ఏళ్లు. 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్‌ రౌహానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో.. 2021లో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడడని ఆయనకు పేరుంది. ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి గమనార్హం. రైసీ జాడ తెలియరాకపోతే.. ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ మొఖ్బర్‌ (69) ఆయన స్థానంలో తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని