China: చైనాలో ఎత్తైన జలపాతం నిజం కాదా..?

చైనాలో సుప్రసిద్ధ పర్యటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన యుంటాయ్ జలపాతం పైన కృత్రిమంగా పైపులు ఏర్పాటుచేసి నీరు విడుదల చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 08 Jun 2024 17:33 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చైనా(China)లోని హెనాల్‌ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక జలపాతం యుంటాయ్(Yuntai Waterfall) 1,024 అడుగుల ఎత్తుతో ఆ దేశంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 మిలియన్ల మంది పర్యటకులు(visitors) ఈ జలపాతాన్ని సందర్శిస్తుంటారు. చైనాలోని యుంటాయ్ మౌంటైన్ పార్క్‌లో ఉండే ఈ జలపాతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. తాజాగా దీనిపైకి ఎక్కిన ఓ హైకర్‌ అక్కడి పరిస్థితిని చూసి కంగుతిన్నాడు. కింది నుంచి చూస్తే ఆకాశం నుంచి జారిపడుతున్నట్లుగా కనిపించే జలపాతం నిజమైనది కాదని తెలిసి అతడు ఆశ్చర్యపోయాడు. పైన ఓ పెద్ద పైపును అమర్చి దానిద్వారా కృత్రిమ జలపాతాన్ని సృష్టించినట్లుగా కనుగొన్నాడు. 

జలపాతం పైన ఏర్పాటుచేసిన పైపు నుంచి నీరు కిందకు పడుతున్న వీడియోను అతడు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. చైనా వస్తువులే కాదు, పర్యటక ప్రదేశాలు కూడా నకిలీవేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘ఇంతకాలం పర్యటకులు తాము ఒక సహజ అద్భుతాన్ని సందర్శిస్తున్నామనే భావనలో ఉన్నారు. కాని ఆ జలపాతం పైపుల ద్వారా సృష్టించిందని ఇప్పుడు అర్థమైంది’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. ‘చైనా తయారుచేసే ఏ నకిలీ వాటికైనా పరిమితులు అనేవే ఉండవు’ అని మరో నెటిజన్‌ స్పందించారు. 

ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో దీనిపై స్థానిక అధికారులు యుంటాయ్ మౌంటైన్ పార్క్‌ నిర్వాహకులను నిలదీశారు. వర్షపాతం తక్కువగా నమోదుకావడం, వేసవిలో నీటి ఎద్దడి వల్లే ఇలా చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చిన ప్రజలు నిరాశ చెందవద్దని కోరారు. పర్యటక ప్రదేశం అందం తగ్గకూడదనేదే ఉద్దేశంతో ఈవిధంగా చేశామన్నారు. జలపాతంలోకి పంపుతున్న నీరు స్ప్రింగ్ వాటర్ అని, దీనివల్ల ప్రకృతికి, సందర్శకులకు ఎటువంటి హానీ ఉండదని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని