PM Modi: మీ ఆతిథ్యంలో ప్రత్యేక గౌరవాన్ని పొందాను: మోదీ

 రెండు రోజుల పర్యటన అనంతరం భూటాన్‌ నుంచి శనివారం బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌కు ఎక్స్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Published : 23 Mar 2024 20:20 IST

థింపూ: రెండు రోజుల పర్యటన అనంతరం భూటాన్‌ నుంచి శనివారం ఇండియాకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని తిరుగు ప్రయాణమవుతుండగా భూటాన్ రాజు ఆయనను సాగనంపడానికి షెరింగ్ టోబ్‌గే  విమానాశ్రయానికి వచ్చారు.

భూటాన్‌ పర్యటన గురించి మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో భూటాన్‌ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను దిల్లీకి బయల్దేరినప్పుడు విమానాశ్రయానికి వచ్చినందుకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ కు ధన్యవాదాలు. ఇది నేను మీనుంచి పొందిన ప్రత్యేకమైన గౌరవం. హిజ్ మెజెస్టీ ది కింగ్, భూటాన్‌లోని ఇతర ప్రముఖులను కలిసే అవకాశం నాకు లభించింది. అక్కడి ప్రజల ఆప్యాయత, ఆతిథ్యం మర్చిపోలేనిది. మన మధ్య జరిగిన చర్చలు భారత్-భూటాన్‌ల మధ్య స్నేహానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు. భూటాన్‌కు భారత్‌ ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితుడిగా, భాగస్వామిగా ఉంటుంది.’’ అంటూ రాసుకొచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని థింపూలో గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా వాంగ్‌చుక్ తల్లీపిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి పూర్తి నిధులు సమకూర్చినందుకు భారత ప్రభుత్వానికి భూటాన్ ప్రధాని టోబ్గే కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ప్రధాని మోదీ 10 వేల కోట్ల గణనీయమైన సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసింది. మోదీ చేసిన ఈ సహాయానికి భూటాన్‌ ప్రధాని టోబ్గే ఆయనను తమ అన్నయ్యగా భావిస్తున్నామని తెలిపారు. 

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ లభించింది. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీయే కావడం గమనార్హం. రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ, భూటాన్ పీఎం టోబ్గే ద్వైపాక్షిక ఇంధన సహకారానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యటకం రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై అవగాహన కుదుర్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని