Xinjiang: ‘వారి మృతికి కరోనా ఆంక్షలే కారణం’..! చైనాలో భగ్గుమన్న నిరసనలు

కరోనా కఠిన ఆంక్షలపై చైనాలోని షింజియాంగ్‌(Xinjiang) ప్రాంతం భగ్గుమంది! జీరో కొవిడ్‌(Zero Covid) చర్యలను నిరసిస్తూ.. ఇక్కడి రాజధాని నగరం ఉర్ముచీ(Urumqi)లో పౌరులు భారీ నిరసనలకు దిగారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు.

Published : 27 Nov 2022 01:36 IST

బీజింగ్‌: కరోనా కఠిన ఆంక్షలపై చైనాలోని షింజియాంగ్‌(Xinjiang) ప్రాంతం భగ్గుమంది! జీరో కొవిడ్‌(Zero Covid) చర్యలను నిరసిస్తూ.. ఇక్కడి రాజధాని నగరం ఉర్ముచీ(Urumqi)లో పౌరులు భారీ నిరసనలకు దిగారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. గురువారం రాత్రి స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి దాదాపు 10 మంది మృతి చెందారు. అయితే, కరోనా ఆంక్షల కారణంగానే వారు బయటకు రాలేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారని ఆరోపణలు రావడం.. పౌరుల ఆగ్రహానికి కారణమైంది. పెద్దఎత్తున స్థానికులు బారికేడ్లను దాటి.. వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల ముందు చేపట్టిన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే.. స్థానిక అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను దశలవారీగా ఎత్తేస్తామని శనివారం హామీ ఇచ్చారు. దాదాపు 40 లక్షల జనాభా కలిగిన ఉర్ముచీ నగరం.. ఆగస్టు నుంచి కొవిడ్‌ ఆంక్షల గుప్పిటలో ఉంది. నగరంలో గత రెండు రోజుల్లో దాదాపు 100 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనాలో పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కఠిన లాక్‌డౌన్‌లు, క్వారంటైన్‌ నిబంధనలు అమలవుతున్నాయి. కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఇటీవల ఇద్దరు చిన్నారులకు సకాలంలో వైద్యం అందక.. ప్రాణాలు కోల్పోయిన ఘటనలోనూ చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని