Elon Musk: ‘సత్యా.. నా సమస్య పరిష్కరించండి’! మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌కు మస్క్‌ మెసేజ్‌

మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేయకుండా విండోస్‌ను వాడుకునేందుకు అనుమతించాలంటూ సత్యా నాదెళ్లను ఎలాన్‌ మస్క్‌ అభ్యర్థించారు.

Published : 28 Feb 2024 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌కు (Elon Musk) ఓ ఊహించని సమస్య ఎదురయ్యింది. ఇటీవల ఆయన విండోస్‌ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయగా.. మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో లాగిన్‌ కావాల్సి వచ్చింది. కానీ, విండోస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసేందుకు ఇష్టపడని మస్క్‌.. ఎక్స్‌ వేదికగా తనకు ఎదురైన ఇబ్బంది గురించి చెప్పుకొన్నారు. సరైన స్పందన రాకపోవడంతో, చివరకు మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్యా నాదెళ్లకే డైరెక్టుగా మెసేజ్‌ పెట్టి తన సమస్యను వివరించారు.

‘సత్యా.. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అనాలని కాదు. కానీ, మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేయకుండా విండోస్‌ను వాడుకునేందుకు అనుమతించండి. ఒకవేళ కంప్యూటర్‌ వైఫైకి కనెక్ట్‌ అయితే ఈ ఆప్షన్‌ కనిపించకుండా పోతుంది. అదేవిధంగా కొత్త అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలన్నా.. వర్క్‌ ఈమెయిల్‌ అడ్రస్‌ వాడుకోలేము. నాకు కేవలం వర్క్‌ ఈమెయిల్స్‌ మాత్రమే ఉన్నాయి’ అని మైక్రోసాఫ్ట్‌ అధినేతకు ఎలాన్‌ మస్క్‌ మెసేజ్‌ చేశారు. అయినా నాదెళ్ల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు.

అంతకుముందు ఇదే అంశంపై ట్వీట్‌ చేసిన మస్క్‌.. ఎంఎస్‌ అకౌంట్‌ లేకుండా కొత్త ల్యాప్‌టాప్‌ను యాక్సెస్‌ చేసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఏఐకి తన కంప్యూటర్‌ యాక్సెస్‌ ఇవ్వాలనుకోవడం లేదన్న ఆయన.. ఇదంతా గందరగోళంగా ఉందన్నారు. ఎంఎస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేయకుండా సిస్టమ్‌ వినియోగించుకునే ఆప్షన్‌ ఉండాలని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని