Elon Musk: అప్పుడు చనిపోతానేమో అనుకున్నా: ఎలాన్‌ మస్క్‌

కొవిడ్‌ రెండో బూస్టర్‌ డోసు వేయించుకున్న తర్వాత చనిపోవాలన్నంత బాధ అనిపించిందని టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ అన్నారు. ఈ మేరకు తాను అనుభవించిన పరిస్థితిని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

Published : 24 Jan 2023 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk) సామాజిక మాధ్యమాల్లో ఇటీవల హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన  తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటిపై యూజర్ల కామెంట్లు, రీ ట్వీట్లతో ‘మస్క్‌’ పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ (Covid Vaccine) వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని ఈ మధ్య కాలంలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆయన చేసిన పోస్టు దుమారం రేపుతోంది. ‘కొవిడ్‌ రెండో బూస్టరు డోసు వేసుకున్న తర్వాత చనిపోతానేమోనని పించింది’ అంటూ వ్యాక్సినేషన్‌ (Vaccination) అనంతరం తాను ఎలాంటి పరిస్థితిని అనుభవించారో ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘కొవిడ్‌ బూస్టర్‌ డోసు వేయించుకున్న తర్వాత చనిపోతానేమో అన్నంత బాధనిపించింది. మొదటి డోసుతో అంతగా ఇబ్బంది అనిపించలేదు. కానీ, రెండో డోసు తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. దీని ప్రభావం చాలా రోజుల వరకు ఉంది. అయితే, క్రమంగా తగ్గింది’’ అని మస్క్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

జర్మనీలోని టెస్లా గిగాఫ్యాక్టరీకి సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో రెండో డోసు వేసుకోవాల్సి వచ్చిందని మస్క్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత తీవ్రమైన కండరాల నొప్పులు, ఒళ్లు మంటలతో బాధపడ్డానని చెప్పారు. ఈ పరిస్థితి తనొక్కడికే కాదని బంధువైన మరో యువకుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని, ఆగమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని మస్క్‌ చెప్పుకొచ్చారు. ‘‘ ఇంతకు ముందు చిన్నపాటి జలుబు చేసినట్లనిపించింది.  తగ్గిన తర్వాత వ్యాక్సిన్‌ వేసుకున్నాను. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. అరచేతిలో కొంచెం దురదపెట్టి తగ్గిపోయింది. తాజాగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ వేసుకున్నాను. ఇది మాత్రం నన్ను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది’’ అని మస్క్‌ రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని