USA: భవిష్యత్తులో ‘ట్రంప్‌’ కంటే మంచి ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ అభ్యర్థిత్వంపై మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌ కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. మరిన్ని మెరుగైన అభ్యర్థులు ఉండొచ్చని పేర్కొన్నారు.

Published : 15 Nov 2022 18:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భవిష్యత్తులో అమెరికాకు ట్రంప్‌తో పోలిస్తే రిపబ్లికన్‌పార్టీకి మెరుగైన అభ్యర్థులు లభించే అవకాశం ఉందని మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌ అభిప్రాయపడ్డారు. 2024 అమెరికా ఎన్నికల బరిలో రిపబ్లికన్ల తరపున మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌ అతడి కుటుంబ సభ్యులు నిలబడే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పెన్స్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తమను పోటీలో నిలబడాలని వస్తున్న అభ్యర్థనలను కుటుంబంతో కలిసి పరిశీలిస్తున్నట్లు పెన్స్‌ వెల్లడించారు. ట్రంప్‌ను ఓడించగలరా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పెన్స్‌ ఆచితూచి సమాధానమిచ్చారు. ఆ విషయం ఇతరులు చెప్పాలని.. తానుకాదని పేర్కొన్నారు. పోటీ చేయాలా వద్దా అన్నది తాము నిర్ణయించుకోవాల్సి ఉందని వెల్లడించారు. 

ట్రంప్‌ మరోసారి ఎన్నికవ్వడంపై పెన్స్‌ స్పందిస్తూ.. అది అమెరికా ప్రజలపై ఆధారపడి ఉంటుందన్నారు. భవిష్యత్తులో దేశ ప్రజలకు మరిన్ని మంచి ఎంపిక అవకాశాలు ఉంటాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. పెన్స్‌ ఇప్పటి వరకు అభ్యర్థిత్వంపై స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఒక వేళ ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటన చేస్తే.. ట్రంప్‌ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక రాజధానిలో అల్లర్ల సమయంలో ట్రంప్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు ‘‘అధ్యక్షుడు చేసిన దానికి నేను బాధ్యుడిని కాదు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని