Japan Plane: ప్రమాద సమయంలో విమానం లోపలే ఉన్నా..!

టోక్యో విమానం ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Updated : 02 Jan 2024 17:25 IST

దిల్లీ: టోక్యో విమాన ప్రమాదంలో (Tokyo plane Accident) ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో సిబ్బందితో సహా దాదాపు నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందర్నీ అధికారులు విమానాశ్రయ టెర్మినల్‌కు తరలిస్తున్నట్లు అందులో ఉన్న విలియం మాంజియోన్‌ అనే ప్రయాణికుడు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘‘ హాయ్‌.. ప్రమాద సమయంలో నేను విమానంలోనే ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని టెర్మినల్‌కు తీసుకెళ్తున్నారు’’ అని రాసుకొచ్చారు. అయితే, అందరూ సురక్షితంగా బయటపడినట్లు జపాన్‌ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

హొక్కైడో విమానాశ్రయం నుంచి బయల్దేరిన జేఏఎల్‌ 516 విమానం హనేడా ఎయిర్‌పోర్టులో దిగుతున్న సమయంలో జపాన్‌ కోస్టు గార్డుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకున్న జేఏఎల్‌ విమానం.. కొంతదూరం అలాగే ప్రయాణించింది. అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది దాదాపు 70 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. 

మరోవైపు జేఏఎల్‌ విమానం ఢీ కొట్టిన కోస్టుగార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరు ప్రమాదం నుంచి బయటపడగా.. మరో ఐదుగురి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ లోపలికి వెళ్లి వెతకడం విమానాశ్రయ సిబ్బందికి సాధ్యం కాలేదు. తాజా ఘటనపై జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా స్పందించారు. తక్షణమే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని