Imran Khan: నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్‌ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ వార్నింగ్‌

Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్‌ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు.

Updated : 18 Apr 2024 10:47 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan) ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీ అరెస్టుకు మునీరే కారణమని ఆరోపించారు. ఆమె ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇస్లామాబాద్‌ శివారులోని నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. 

బుష్రా బీబీకి శిక్ష విధించిన న్యాయమూర్తే తనతో మాట్లాడినట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) తెలిపారు. తీర్పు విషయంలో తనపై ఒత్తిడి ఉండేదని చెప్పినట్లు వెల్లడించారు. ఒకవేళ తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని ఇమ్రాన్ హెచ్చరించారు. తాను బతికున్నంత వరకు మునీర్‌ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. మునీర్‌ తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తానని వ్యాఖ్యానించారు.

‘‘దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఆ అడవికి రాజే అన్నీ నిర్ణయిస్తాడు. ఆయన కోరుకుంటే నవాజ్‌ షరీఫ్ నేరాలన్నింటినీ క్షమించేస్తారు. అలాగే మాకు ఐదు రోజుల్లో మూడు కేసుల్లో శిక్ష విధిస్తారు’’ అని పరోక్షంగా మునీర్‌ను ఉద్దేశించి ఇమ్రాన్‌ (Imran Khan) ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్‌ రుణాల ద్వారా గాడినపడదని అన్నారు. పెట్టుబడుల ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం వస్తుందని సూచించారు. దేశంలో చట్టం పటిష్ఠంగా అమలైనప్పుడే పెట్టుబడులు వస్తాయని.. ఆటవిక రాజ్యం అమల్లో ఉన్నంత కాలం అది సాధ్యం కాదన్నారు. ఇమ్రాన్‌ చేసిన ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు పాక్‌ ఆర్మీ స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని