Imran Khan: ‘పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు.. అరెస్టుకు ముందు ఇదే నా చివరి ట్వీట్‌ కావొచ్చు!’

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) మరోసారి అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారన్న ఆయన.. తదుపరి అరెస్టుకు ముందు ఇదే చివరి ట్వీట్‌ కావొచ్చన్నారు.

Updated : 18 May 2023 13:32 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) మరోసారి అరెస్టయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారన్న ఆయన.. తన అరెస్టు చేసే అవకాశం ఉందని.. అరెస్టుకు ముందు బహుశా ఇదే తన చివరి ట్వీట్‌ కావొచ్చేమోనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల తన అరెస్టు అనంతరం చెలరేగిన హింసపై స్వతంత్ర్య దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతోపాటు తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.

విధ్వంసం దిశగా పాక్‌..

‘మిలటరీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. స్వతంత్ర్య దర్యాప్తు జరపకుండా ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. పీటీఐ పార్టీని ఉగ్రవాద సంస్థగా నిర్ణయించారు. ఇప్పటికే 7500 మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ (తూర్పు పాకిస్థాన్‌) అవతరణను గుర్తుచేసుకున్న ఆయన.. పాకిస్థాన్‌ విధ్వంసం దిశగా పయనిస్తోందనే భయం ప్రస్తుతం కలుగుతోందన్నారు. ఇలా ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన నివాసం జమాన్‌ పార్కువైపు వచ్చే రోడ్లన్నింటినీ పోలీసులు మూసివేసినట్టు స్థానిక వార్తా ఛానళ్లు వెల్లడించాయి. ఆయన ఇంటిచుట్టూ భారీస్థాయిలో పోలీసులు మోహరించిన వీడియోలు ప్రసారం చేశాయి.

ఇమ్రాన్‌ ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు..

అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన పంజాబ్‌ ఆపద్ధర్మ సమాచార మంత్రి ఆమిర్‌ మీర్‌ మాట్లాడుతూ.. లాహోర్‌లోని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటిలో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారన్నారు. దీనిపై తమకు నిఘా సంస్థల నుంచి సమాచారం ఉందన్న ఆయన.. వారందర్నీ 24 గంటల్లో తమకు అప్పగించాలని ఇమ్రాన్‌ ఖాన్‌కు అల్టిమేటం జారీచేశారు. అయితే, దీనిపై స్పందించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. అలాంటి అనుమానమే ఉంటే సెర్చ్‌ వారెంట్‌ తీసుకువచ్చి సోదాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5,000 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసేందుకు గత మార్చిలోనే ప్రయత్నించినప్పటికీ భారీ సంఖ్యలో ఖాన్‌ మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు విఫలమయ్యారు. అయితే, ఓ కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఆయన్ను.. పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. పాక్‌ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్‌ అరెస్టు అక్రమమని.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో ఆయన బయటకు వచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని