India-Canada: బుద్ధి మార్చుకోని ట్రూడో.. యూఏఈతో ‘భారత్‌’ గురించి చర్చ..!

India - Canada Diplomatic Row: యూఏఈ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. భారత్‌తో వివాదం గురించి చర్చించారు. భారత్‌, కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ట్రూడో చర్య వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉంది.

Published : 09 Oct 2023 10:21 IST

టొరంటో: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ దిల్లీతో కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Canada PM Justin Trudeau).. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘చట్టాలను సమర్థించడం, గౌరవించడం’పై ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది. అంతేగాక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌తో ‘భారత్-కెనడా దౌత్య వివాదం (India - Canada Diplomatic Row)’ గురించి చర్చించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం.

‘‘యూఏఈ (UAE) అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ (Mohamed Bin Zayed)తో ఫోన్లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మేం పరస్పరం ఆందోళన వ్యక్తం చేశాం. పౌరుల ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించాం. ఇక భారత్‌ అంశం, చట్టాలను సమర్థించడం, పరస్పరం గౌరవించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను గురించి కూడా మేం చర్చించుకున్నాం’’ అని ట్రూడో రాసుకొచ్చారు.

నిజ్జర్ హత్యపై ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్‌-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ట్వీట్‌ ఇరు దేశాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా ఉంది. నిజ్జర్‌ను తమ దేశ పౌరుడని పేర్కొన్న ట్రూడో.. కెనడా భూభాగంలో జరిగిన ఈ హత్యలో విదేశీ ప్రభుత్వాల ప్రమేయం తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చట్టాల గురించి భారత్‌నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలతో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు.

కెనడాలో ఉద్యోగాలు దొరకట్లేదు.. హెల్పర్లు, క్యాబ్‌ డ్రైవర్లుగా భారత విద్యార్థులు

కాగా.. ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ ట్రూడో ఈ వివాదం గురించి చర్చించారు. ‘‘భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితులను రిషి సునాక్‌కు జస్టిన్‌ ట్రూడో వివరించారు. ఈ క్రమంలోనే.. దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వభౌమాధికారం, చట్టపాలనను అన్ని దేశాలు గౌరవించాలనే వైఖరికి బ్రిటన్‌ కట్టుబడి ఉన్నట్లు సునాక్‌ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు’’ అని డౌనింగ్‌ స్ట్రీట్‌ గతవారం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని