Shani Louk: ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!

హమాస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన యువతి షానీ లౌక్‌తోపాటు మరో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Published : 17 May 2024 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది అక్టోబరులో హమాస్‌ (Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ (Israel)లోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. కొందరు పౌరులను బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో 23 ఏళ్ల జర్మనీ-ఇజ్రాయెలీ యువతి షానీ లౌక్‌ (Shani Louk)ను బంధించి నగ్నంగా వీధుల్లో ఊరేగించిన దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. తాజాగా ఆమెతోపాటు మరో ఇద్దరు బందీల మృతదేహాలను గాజాలోని రఫాలో ఓ సొరంగం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) ప్రకటించింది. మిగతా ఇద్దరిని యిత్జాక్‌ గాలంటర్‌, అమిత్‌ బుస్కిలాగా గుర్తించినట్లు తెలిపింది.

ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం

అక్టోబరు 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి ఈ ముగ్గురినీ హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారని.. అనంతరం వారిని చంపేసి, మృతదేహాలను గాజాకు తీసుకెళ్లారని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడించారు. తాజా పరిణామంపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందీలందరినీ సురక్షితంగా తీసుకొస్తామని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఇదిలా ఉండగా.. షానీ లౌక్‌ను హమాస్‌ మిలిటెంట్లు నగ్నంగా ఊరేగించిన చిత్రానికి ఇటీవల ఉత్తమ ఫొటో అవార్డు దక్కడం తీవ్ర దుమారం రేపింది. ఆ దారుణాన్ని ఉత్తమ ఫొటోగా ఎంపిక చేయడం ఏంటని.. నెట్టింట పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని