Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్‌

అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్‌ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. 

Updated : 18 May 2024 10:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిర్గిస్థాన్‌(Kyrgyzstan) దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరు బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు అక్కడి మన దేశ రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.

‘‘మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’’ అంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నంబర్‌(0555710041)ను షేర్ చేసింది. కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్‌ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది. ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్‌లో భారత్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ రోజు ఉదయం విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంబసీతో టచ్‌లో ఉండాలని అక్కడున్న మనవారికి సూచించారు. ఈ మూక హింసలో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడటంతో కేంద్రం నుంచి సూచన వచ్చింది. ముగ్గురు పాకిస్థాన్‌ విద్యార్థులు మృతి చెందారంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దానికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు