ఎన్నికల ప్రక్రియపై ఐరాసలో వ్యాఖ్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్‌

మన దేశ ఎన్నికల ప్రక్రియ(Electoral Process )పై ఐరాస మానవహక్కుల విభాగం అధిపతి వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్‌ గట్టిగా సమాధానం ఇచ్చింది. 

Updated : 05 Mar 2024 13:37 IST

దిల్లీ: కొద్దివారాల్లో మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ(Electoral Process)పై ఐరాస మానవహక్కుల విభాగం అధిపతి చేసిన వ్యాఖ్యలపై భారత్‌ దీటుగా బదులిచ్చింది. అది అసంబద్ధ ఆందోళన అని వ్యాఖ్యానించింది. 

జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 55వ సమావేశంలో మానవ హక్కుల విభాగం అధిపతి వోకర్‌ టర్క్‌ మాట్లాడుతూ.. మైనార్టీలపై వివక్ష, మానవ హక్కుల పరిరక్షకులు, పాత్రికేయులపై పరిమితులు, విమర్శకుల లక్ష్యంగా దాడి ఘటనలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జెనీవాలోని ఐరాస కార్యాలయంలో శాశ్వత రాయబారి అరిందమ్ బాగ్చి స్పందించారు. ‘ఈ ఆందోళనలు అసంబద్ధమైనవి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ వాస్తవికతను ప్రతిబింబించడం లేదు.  ప్రజాస్వామ్యంలో వాదనలు సహజమే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మా అనుభవాలనుంచి నేర్చుకోవాలని, అనుకరించాలని కోరుకుంటున్నాయి. భారత ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. గతంలో మాదిరిగానే ఈ ప్రక్రియ జరుగుతుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు’ అని బాగ్చి వెల్లడించారు.

పాక్‌కు భారత్‌ కౌంటర్‌..

ఇదే వేదికపై జమ్మూకశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ లేవనెత్తగా.. భారత్‌ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దాని భయానక మానవహక్కుల రికార్డును పాక్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని మండిపడింది. ‘గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ ఫ్యాక్టరీ’ అనే పదం ఆ దేశానికి సరిగ్గా సరిపోతుందంటూ దుయ్యబట్టింది. సదరు ప్రతినిధి బృందం తమ దేశంపై చేసే నిరాధార వ్యాఖ్యలకు స్పందించడం ద్వారా మండలి సమయాన్ని వృథా చేయదల్చుకోలేదని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని