USA:పాక్‌ కవ్వింపు చర్యలను.. మోదీ చూస్తూ ఊరుకోరు: యూఎస్ నివేదిక

ప్రధాని మోదీ(Modi) నాయకత్వంలోని భారత్.. పాక్‌ రెచ్చగొట్టే చర్యలను చూస్తూ ఊరుకోదని అమెరికన్ నివేదిక ఒకటి అంచనా వేసింది. అలాగే భారత్‌,చైనా సంబంధాలపైనా స్పందించింది. 

Updated : 09 Mar 2023 14:11 IST

దిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ(Modi) నాయకత్వంలో గతంలో కంటే దీటుగా సైనిక శక్తితో ప్రతిస్పందించగలదని అమెరికన్ ఇంటిలిజెన్స్‌ కమ్యూనిటీ(American intelligence community) అభిప్రాయపడింది. భారత్‌-పాకిస్థాన్‌(India and Pakistan), భారత్-చైనా(India and China) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఘర్షణలకు అవకాశం ఉందని అంచనా వేసింది. యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో భాగంగా ఈ ముప్పు అంచనాలు వెలువరించింది. 

‘సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా ద్వైపాక్షిక చర్చలు జరుతున్నాయి. కానీ, 2020లో జరిగిన గల్వాన్‌ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వద్ద పెరిగిన సైనిక మోహరింపులు ఈ అణుశక్తుల మధ్య ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అది యూఎస్ ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చు’ అని ఆ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో యూఎస్‌ జోక్యానికి పిలుపునిచ్చింది. గతంలోని సంక్షోభాలను బట్టి చూస్తే.. వాస్తవాధీన రేఖ వద్ద స్వల్ప స్థాయి ఆకస్మిక ఘర్షణలు అవకాశం ఉండొచ్చని తెలిపింది. 

అలాగే భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ‘భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్‌(Pak)కు ఉంది. పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు మోదీ నాయకత్వంలోని భారత్‌ గతంలో కంటే దీటుగా సైనికశక్తితో స్పందించగలదు. కశ్మీర్‌లో అశాంతి వంటి అంశాలు ఈ అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రికత్తలను పెంచుతున్నాయి’ అని ఆ నివేదిక పేర్కొంది. అయితే 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వద్ద  కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణ ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులకు దోహదం చేయొచ్చని అంచనావేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని