Dharma Guardian: భారత్-జపాన్ సేనల ‘ధర్మ గార్డియన్‌’ విన్యాసాలు షురూ

భారత్‌ (India), జపాన్‌ (Japan) మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా కీలక  ముందడుగు పడింది.

Published : 25 Feb 2024 19:59 IST

జైపుర్‌:  భారత్‌ (India), జపాన్‌ (Japan) మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది. ‘ధర్మ గార్డియన్‌’ పేరిట ఇరుదేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు ( joint Air Exercise) ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న మొదలైన ఈ విన్యాసాలు రాజస్థాన్‌లోని మహజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో మార్చి 9 వరకు కొనసాగనున్నాయి. ‘ధర్మ గార్డియన్’ అనేది వార్షిక విన్యాస ప్రక్రియ. భారత్‌, జపాన్‌లలో ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తుంటారు. ఇరుదేశాల నుంచి  40 మంది చొప్పున సిబ్బంది పాల్గొంటారు. జపనీస్‌ బృందానికి 34వ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ప్రాతినిధ్యం వహిస్తుండగా..  భారత్‌ తరఫున రాజ్‌పుతానా రైఫిల్స్‌కు చెందిన బెటాలియన్‌ పాల్గొంది.  ఇరుదేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడం, సెమీ-అర్బన్ వాతావరణంలో ఉమ్మడి కార్యకలాపాలను అమలు చేసేందుకు సంయుక్తంగా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం. శారీరక దృఢత్వంతో పాటు ఉమ్మడి ప్రణాళిక, వ్యూహాత్మక కసరత్తులు, ప్రత్యేక ఆయుధ నైపుణ్యాలు వంటి ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టనున్నాయి. 

ఈ విన్యాసాల సమయంలో సాధన చేయాల్సిన వ్యూహాత్మక కసరత్తుల్లో తాత్కాలిక ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు, ఇంటెలిజెన్స్, నిఘా (ISR) గ్రిడ్ ఏర్పాటు చేయడం, మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ ఏర్పాటు, శత్రువుల కదలికల్ని పసిగట్టి వారిని మట్టుబెట్టేందుకు నిరంతరం సోదాలు జరపడం వంటి అనేకం ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భారత్‌లో పెరుగుతున్న రక్షణ పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రదర్శించే ఆయుధ సామగ్రిని సైతం ప్రదర్శించనున్నారు. జపాన్‌ గ్రౌండ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్ ఫోర్స్‌ కమాండింగ్‌ జనరల్‌,  లెఫ్టినెంట్‌ జనరల్‌ తోగాషి యుచి మార్చి 3న ఈ విన్యాసాలను తిలకించేందుకు రాబోతున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ధర్మ గార్డియన్’ విన్యాసాలు ఇరు దేశాల సైనిక వ్యూహాలు, సాంకేతికత, వ్యూహాత్మక విధానాల్లో ఉత్తమ అభ్యాసాలను పంచుకొనేందుకు ఇరు పక్షాలకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. దీంతో పాటు రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించడంతో పాటు రక్షణ సహకార స్థాయిని మెరుగు పరుస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని