BAPS: అబుదాబీ నారాయణుడి సేవ కోసం.. ఉద్యోగాన్ని వదులుకున్నాడు

దుబాయ్‌లో నెలకు రూ.లక్షల్లో సంపాదించే ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఓ వ్యక్తి అబుదాబీలోని స్వామి నారాయణ ఆలయంలో పూర్తిస్థాయి వలంటీరుగా సేవలందిస్తున్నారు. మానవ సేవే... మాధవ సేవ అనే సిద్దాంతాన్ని ఆచరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నారు.

Published : 28 Feb 2024 01:48 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇటీవల అబుదాబీలో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభమైన స్వామినారాయణ్ సంస్థ (BAPS) ఆలయంలో భారతీయ మూలాలున్న కుటుంబంలో పుట్టిన విశాల్ పటేల్(43) పూర్తిస్థాయి వలంటీరుగా విధులు చేపట్టారు. ఆయన లండన్‌లోనే పుట్టి పెరిగారు. వారి పూర్వీకుల స్వస్థలం గుజరాత్‌.

లండన్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం చదివిన విశాల్‌ అక్కడి BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్‌లో వాలంటీర్‌గా పనిచేస్తూ మంచి పేరున్న పెట్టుబడి బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్‌లో ఉద్యోగం చేసేవారు. అనంతరం 2016లో యూఏఈకి వెళ్లి దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో విధుల్లో చేరారు. నాటినుంచి అతడు యూఏఈలోని BAPS నిర్వహించే సేవా కార్యక్రమాల్లో వలంటీరుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ నిర్మాణం దగ్గర నుంచి ప్రారంభోత్సవంలో అతిథులకు సేవ చేయడం వరకు అన్ని విషయాల్లో విశాల్ పటేల్ చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన తన ఉద్యోగాన్ని వదులుకొని ఆలయ ప్రధాన సమాచార అధికారి, మీడియా సంబంధాలు మరియు వ్యూహాత్మక సమాచారాలతో సహా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ మందిరంలో సేవ చేయడం వల్ల నేను సమాజానికి సేవ చేయగలుగుతున్నాను. ప్రజలకు మంచి చేసే పనులలో నిమగ్నమై ఉన్నానని పటేల్ తెలిపారు. సంస్థకు సేవ చేసేందుకు నాలా చాలామంది తమ ఉద్యోగాలను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆలయంలో విద్యార్థులు, ఉద్యోగార్థులకు కెరీర్ ఫెయిర్లను నిర్వహిస్తామన్నారు.

ఆలయం తనకు, మరెందరో యువ వలంటీర్లకు బలమైన పునాది వేసిందని ఆనందం వ్యక్తంచేశారు. ఈ అబుదాబీ మందిరం నిస్సందేహంగా ఇక్కడి సమాజానికి అన్నివిధాలా సహాయ సహకారాలు, మద్దతును అందిస్తుందని పటేల్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని