USA: భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్‌ అత్యున్నత అకడమిక్‌ అవార్డు

USA:  ‘ఇమేజింగ్‌ సాంకేతికత’లో చేసిన పరిశోధనలకుగానూ భారత సంతతి ఇంజినీర్‌ అశోక్‌ వీరరాఘవన్‌కు అత్యున్నత అకడమిక్‌ అవార్డు లభించింది.

Updated : 26 Feb 2024 09:56 IST

టెక్సాస్‌: భారత సంతతికి చెందిన ప్రముఖ కంప్యూటర్‌ ఇంజినీర్‌, ప్రొఫెసర్‌ అశోక్‌ వీరరాఘవన్‌కు టెక్సాస్‌ అత్యున్నత అకడమిక్‌ అవార్డు (Texas highest academic award) ‘ఎడిత్‌ అండ్‌ పీటర్‌ ఓడన్నెల్‌’ పురస్కారం దక్కింది. ‘టెక్సాస్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (TAMEST)’ ఈ అవార్డును బహూకరిస్తుంది. ఆ రాష్ట్రంలో ఆయా రంగాల్లో ప్రతిభ చూపుతున్న ఔత్సాహిక పరిశోధకులకు ఈ సత్కారాన్ని అందజేస్తుంటారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో చేసిన కృషికిగానూ వీరరాఘవన్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ‘ఇమేజింగ్‌ సాంకేతికత’లో ఆయన చేసిన విప్లవాత్మక పరిశోధనలను గుర్తిస్తూ అవార్డును ప్రదానం చేశారు.

చెన్నైలో పుట్టి పెరిగిన వీరరాఘవన్‌ (Ashok Veeraraghavan) ప్రస్తుతం రైస్‌ యూనివర్సిటీకి చెందిన జార్జ్‌ ఆర్‌.బ్రౌన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ‘ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘‘ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రైస్ యూనివర్సిటీలోని కంప్యుటేషనల్ ఇమేజింగ్ ల్యాబ్‌లో చాలా మంది విద్యార్థులు, పోస్ట్‌డాక్టోరల్స్‌, రీసెర్చ్ సైంటిస్టులు గత దశాబ్ద కాలంగా చేసిన అద్భుతమైన, వినూత్న పరిశోధనలకు ఇది గుర్తింపు’’ అని వీరరాఘవన్‌ అన్నారు. కాంతి ప్రసరించే మాధ్యమంలోని పరిమితుల వల్ల ప్రస్తుత ఇమేజింగ్ సాంకేతికతల విజువలైజేషన్ లక్ష్యం చేరుకోలేకపోతోందని.. దాన్ని పరిష్కరించే విషయంలో తమ పరిశోధనలు ఎంతో పురోగతి సాధించాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని