US Spelling Bee: 90 సెకన్లలో 29 పదాలు.. అమెరికా ‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా తెలుగు సంతతి బాలుడు

US Spelling Bee: స్పెల్లింగ్‌ బీ పోటీల్లో మరోసారి భారత అమెరికన్‌ విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బాలుడు టైటిల్‌ నెగ్గాడు.

Updated : 31 May 2024 11:41 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో (US Spelling Bee) ఈ ఏడాది కూడా భారత అమెరికన్‌ విద్యార్థుల (Indian - American students) హవా కొనసాగింది. 2024 స్క్రిప్స్‌ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్‌ సోమ (Bruhat Soma) విజేతగా నిలిచాడు. 90 సెకన్లలో abseil సహా 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పి.. కప్‌తో పాటు 50వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన బృహత్‌ ప్రస్తుతం ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్‌ సోమ స్వస్థలం తెలంగాణ (Telangana)లోని నల్గొండ.

ఈ ఏడాది స్పెల్లింగ్‌ బీ పోటీల్లో 245 మంది విద్యార్థులు పాల్గొనగా.. వీరిలో 8 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇందులో బృహత్‌, ఫైజన్‌ జాకీ మధ్య టై అయ్యింది. టైబ్రేకర్‌గా ఇద్దరికీ 90 సెకన్ల సమయం ఇచ్చారు. ఇందులో జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా.. బృహత్‌ 29 పదాల స్పెల్లింగ్‌ (Spellings)లను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్‌ గెల్చుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్‌ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా.. ఆ రికార్డును ఇప్పుడు బృహత్‌ అధిగమించాడని నిర్వాహకులు వెల్లడించారు.

ఇంటర్మీడియట్లో.. ఏ గ్రూపు ఎందుకని?

స్పెల్లింగ్‌ బీ పోటీ (Spelling Bee Championship)ల్లో బృహత్‌ పాల్గొనడం ఇది మూడోసారి. 2022లో 163వ స్థానంలో ఉండగా.. గతేడాది 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది టైటిల్‌తో సత్తా చాటాడు. టై బ్రేకర్‌లో ఓడిన జాకీకి 25వేల డాలర్ల ప్రైజ్‌ మనీ లభించింది. ఇక, ఈ పోటీల్లో శ్రేయ్‌ పరీఖ్‌  2వ, అనన్య రావు ప్రసన్న మూడో స్థానంలో నిలిచారు. 1925 నుంచి జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. 1999 నుంచి ఇప్పటివరకు 29 మంది ఇండియన్‌-అమెరికన్‌ విద్యార్థులు ఇందులో ఛాంపియన్లుగా నిలవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని