Indian Navy: సముద్రంలో మరో ఆపరేషన్‌.. 23 మంది పాక్‌ సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ

ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌ కావడంతో ఇండియన్‌ నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. అందులో ఉన్న 23 మంది పాక్‌ పౌరులైన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Updated : 30 Mar 2024 09:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర దేశాల నౌకలు రిస్క్‌లో ఉన్నప్పుడు రక్షించేందుకు ఎల్లప్పుడు ముందుండే భారత నేవీ (Indian Navy) మరోమారు సాహసం చేసింది. వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్‌ అయిన ఇరాన్‌ చేపల బోటును, అందులో సిబ్బందిని రక్షించింది. బోటులో ఉన్నవారు పాకిస్థాన్‌కు చెందిన 23 మంది సిబ్బంది అని భారత నేవీ పేర్కొంది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్‌ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల బోటు (Al Kambar) హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్‌ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్లు భారత నేవీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో తొలుత ఐఎన్‌ఎస్‌ సుమేధా (INS Sumedha) సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్‌’ బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ (INS Trishul) నౌక దానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థాన్‌ (Pakistan) జాతీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది.

రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడిఉన్నట్లు నేవీ ప్రకటించింది. గత కొంతకాలంగా గల్ఫ్‌ ఏడెన్‌లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు అండగా నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని