USA: ‘హైపోథెర్మియా’తోనే అమెరికాలో భారత సంతతి విద్యార్థి మృతి!

USA: అమెరికాలో జనవరి 20న అకుల్‌ ధావన్‌ మృతికి గల కారణాన్ని ఇల్లినాయిస్‌ ఛాంపెయిన్‌ కౌంటీ కార్నర్స్‌ ఆఫీస్‌ ప్రకటించింది.

Updated : 23 Feb 2024 10:48 IST

వాషింగ్టన్‌: అమెరికాలో భారత సంతతి విద్యార్థి అకుల్‌ ధావన్‌ మృతికి గల కారణాన్ని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఆల్కహాల్‌ను అధిక మోతాదులో తీసుకోవడం, గడ్డకట్టే చలిలో ఎక్కవసేపు ఉండడం వల్ల తలెత్తిన హైపోథెర్మియాతోనే (Hypothermia) అతడు మృతి చెందినట్లు ఇల్లినాయిస్‌ ఛాంపెయిన్‌ కౌంటీ కార్నర్స్‌ ఆఫీస్‌ ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. 

జనవరి 20న అకుల్ తన మిత్రులతో కలిసి క్యాంపస్‌కు సమీపంలోనే ఉన్న కెనోపి క్లబ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కానీ, అక్కడి సిబ్బంది అతడి ప్రవేశాన్ని నిరాకరించారని పేర్కొన్నారు. అనేకసార్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారు అనుమతించలేదని చెప్పారు. క్యాబ్‌లు బుక్‌ చేసినా.. అక్కడి నుంచి వెళ్లడానికి అకుల్‌ నిరాకరించినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఇల్లినాయిస్‌లో జనవరిలో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోతుంటాయి.

సిబ్బంది నిరాకరించటంతో అకుల్‌ క్లబ్‌ దగ్గరి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. తర్వాత మిత్రులు అతణ్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. దీంతో వారిలో ఒకరు తమకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వెంటనే గాలింపు చేపట్టగా.. కొన్ని గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. అతడిలో హైపోథెర్మియా లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని