London: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత పీహెచ్‌డీ విద్యార్థిని మృతి

London: లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుతున్న చేష్ఠా కొచ్చర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Updated : 25 Mar 2024 20:03 IST

లండన్‌: లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన చేష్ఠా కొచ్చర్‌ దుర్మరణం చెందారు. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ (LSE)లో ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. గతంలో ఆమె నీతి ఆయోగ్‌కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం పనిచేశారు.

‘‘చేష్ఠా కొచ్చర్‌ నీతి ఆయోగ్‌లో ‘లైఫ్‌’ ప్రోగ్రాంపై పనిచేశారు. బిహేవియరల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు వెళ్లారు. సైక్లింగ్‌ చేస్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చాలా తెలివైన వ్యక్తి. ధైర్యవంతురాలు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమితాబ్‌ కాంత్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

మార్చి 19న ఎల్‌ఎస్‌ఈ నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్‌ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందారు. ఆమె తండ్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ (రిటైర్డ్‌) మృతదేహాన్ని తీసుకురావడానికి లండన్‌కు చేరుకున్నారు. గురుగ్రామ్‌లో నివాసముండే చేష్ఠా.. సెప్టెంబరులోనే పీహెచ్‌డీ కోసం అక్కడికి వెళ్లారు. గతంలో ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్‌లోని నేషనల్‌ బిహేవియరల్‌ ఇన్‌సైట్స్‌ యూనిట్‌లో సీనియర్‌ సలహాదారుగా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని