Hyderabad Student :: అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. 

Updated : 09 Apr 2024 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్‌ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి (Hyderabad Student) మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ (25) (Mohammed Abdul Arfath) మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్‌లో ప్రకటించింది. ‘‘మేము గత కొంతకాలంగా వెతుకుతున్న మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ ఓహైయోలోని క్లేవ్‌ల్యాండ్‌లో మృతి చెందాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తరలించడానికి సహాయం చేస్తాం’’ అని పేర్కొంది.

హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అతడి తండ్రి మహమ్మద్‌ సలీం వెల్లడించారు. వారు 1,200 డాలర్లు డిమాండ్‌ చేస్తున్నారని.. ఇవ్వని పక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. తాము అంగీకరించి.. అబ్దుల్‌ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగామన్నారు. దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్‌ పెట్టేశారని.. మళ్లీ కాల్‌ చేయలేదని అప్పట్లో సలీం తెలిపారు. కాకపోతే.. కిడ్నాపర్‌ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఎవరిదో ఏడుపు వినిపించిందన్నారు. ఆ నంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపి.. క్లేవ్‌ల్యాండ్‌ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు తెలిపారు.

అబ్దుల్‌ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8వ తేదీనే క్లేవ్‌ల్యాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ఇక అతడి తల్లి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన కుమారుడితో చివరిసారిగా మార్చి 7వ తేదీన మాట్లాడినట్లు వెల్లడించారు. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని