UNSC: వెంటనే సంస్కరణలు చేపట్టకపోతే.. భద్రతా మండలికి భారత్‌ హెచ్చరిక!

UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలపై దాదాపు 25 ఏళ్లుగా చర్చలు కొనసాగుతున్నాయని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ గుర్తుచేశారు.

Published : 10 Mar 2024 12:36 IST

UNSC | దిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్‌ సూచించింది. లేదంటే సంస్థ విస్మరణకు గురవుతుందని హెచ్చరించింది. దాదాపు 25 ఏళ్లుగా ఈ అంశంపై చర్చలు కొనసాగడంపై అసహనం వ్యక్తం చేసింది. ‘మిలినియం సమ్మిట్‌ 2000’లోనే సంస్కరణలను ప్రతిపాదించారని ఓ సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ గుర్తు చేశారు.

భద్రతా మండలి (UNSC) సంస్కరణల విషయంలో ముందు తరాలు ఇక ఏమాత్రం వేచి చూసే అవకాశం లేదని కాంబోజ్‌ స్పష్టం చేశారు. ఇంకా ఎంతకాలం ఓపిక పడతారని ప్రశ్నించారు. వెంటనే సంస్కరణల దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా ఆఫ్రికా వంటి చరిత్రాత్మకంగా అన్యాయానికి గురైన ప్రాంతాలకు ప్రాముఖ్యత కల్పించాలని హితవు పలికారు. తద్వారా తప్పులను సరిదిద్దాలని సూచించారు. భద్రతా మండలిని శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పులో అసమానతలను మరింత పెంచుతుందని హెచ్చరించారు.

భారత ప్రతిపాదనలకు బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌ మద్దతు పలికాయి. 193 సభ్యదేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా సంస్థ కూర్పు ఉండాలని నొక్కి చెప్పాయి. సంస్కరణల పథంలో అర్హత కలిగిన గ్రూపులు, దేశాలను గుర్తించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంబోజ్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని