EasyJet: మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి

ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్‌లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది.

Published : 23 Apr 2024 16:24 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్: ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్‌లైన్ సిబ్బంది, పోలీసులపైన దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇతర ప్రయాణికులు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈజీ జెట్‌ విమానం టర్కీలో ల్యాండ్‌ అయిన అనంతరం మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం పైకప్పును బాదుతూ మరో వ్యక్తితో వాదనకు దిగాడు. అతడిని వారించడానికి చూసిన టర్కీ పోలీసు అధికారి, మహిళా ఎయిర్‌లైన్‌ ఉద్యోగిపైనా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామంతో ఇతర ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం అధికారులు అతడిని విమానం నుంచి బయటకు పంపించారు.

ప్రయాణికుల వివరాల ప్రకారం... ఎడిన్‌బర్గ్‌లో విమానం బయలుదేరినప్పటినుంచి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్కాటిష్‌ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య జరుగుతున్న పోటీని చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. దాంతో అతడి ప్రవర్తనపై పక్కనున్న మరో వ్యక్తి అసహనం వ్యక్తంచేశాడు. వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిందితుడు తోటి ప్రయాణికుడిపైనా, విమాన సిబ్బందిపైనా దాడి చేశాడు.

ఈ ఘటనపై ఈజీజెట్‌ అధికారులు స్పందిస్తూ ‘‘ఒక ప్రయాణికుడు విమానంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ మనస్తత్వాలు గల ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలి, తగిన చర్యలు ఎలా తీసుకోవాలనే విషయంలో మా సిబ్బంది శిక్షణ పొందారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు మా సంస్థ అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇలాంటి సంఘటనలను ఎప్పటికీ సహించము.’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని