Israel-Hamas Conflict: త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్‌.. హెజ్‌బొల్లా హెచ్చరిక

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో హెజ్‌బొల్లా సైతం తలదూరుస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్‌ మద్దతుతో ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది.

Published : 26 May 2024 10:22 IST

గాజా: గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ (Israel) యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఇరాన్‌ మద్దతున్న హెజ్‌బొల్లా (Hezbollah) గ్రూప్‌ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు మద్దతుగా దాడులకు దిగుతున్న ఈ సంస్థ త్వరలో తమ నుంచి ఇజ్రాయెల్‌ ‘సర్‌ప్రైజ్‌’ అందుకోబోతోందంటూ ఓ సందేశాన్ని విడుదల చేసింది.

హోజ్‌బొల్లా సెక్రటరీ జనరల్‌ హసన్‌ నస్రల్లాహ్‌ ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశంలో ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. బహుశా ఈ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపు దాడులకు దిగొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోరులో తాము ఏమీ సాధించలేకపోయామని స్వయంగా ఇజ్రాయెల్‌ అంగీకరించిందని నస్రల్లాహ్‌ తన సందేశంలో చెప్పుకొచ్చారు. పైగా ఇటీవల ఐరోపా దేశాలు.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం వారికి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. హమాస్‌ పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

గాజా, రఫాలో ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను పాటించడం లేదని నస్రల్లాహ్‌ ఆరోపించారు. అంతర్జాతీయ కోర్టు ఆదేశించినప్పటికీ.. రఫాలో దాడులకు పాల్పడుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని