Iran Israel conflict: ఇజ్రాయెల్‌పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్‌

ఇరాన్‌ శనివారం ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ప్రయోగించింది. వాటిని ఎదుర్కొవడానికి తమ సైన్యం సిద్దంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది.

Updated : 14 Apr 2024 13:32 IST

జెరూసలెం: ఇరాన్‌ శనివారం ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. ఇరాన్‌ నుంచి ఇరాక్‌ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌వైపు డజన్ల కొద్ది డ్రోన్‌లు ఎగురుతున్నట్లు ఇరాన్‌ స్థానిక మీడియా కథనాల్లో వెల్లడైంది. అయితే వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ వాటి గగనతలాన్ని మూసివేశాయి. ఈ నేపథ్యంలో సిరియా, జోర్డాన్‌ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేసింది.

ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్‌జీసీకి చెందిన పలువురు సీనియర్‌ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. అన్నిరకాలుగా టెల్‌ అవీవ్‌కు సాయం చేస్తామని.. ఆ దేశ భద్రతకు తాము హామీ అని బైడెన్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని