ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్‌ కోర్టు ఆదేశం

నాలుగేళ్ల క్రితం ఇరాన్‌(Iran)కు చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్ ఖాసీం సులేమానీ అమెరికా దాడిలో మృతి చెందాడు. దీనిపై అమెరికా(USA) నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 

Updated : 06 Dec 2023 20:40 IST

టెహ్రాన్‌: అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు 50 బిలియన్ల డాలర్లు పరిహారం చెల్లించాలని టెహ్రాన్ కోర్టు ఆదేశించింది. సుమారు నాలుగేళ్ల క్రితం ఇరాన్‌కు చెందిన టాప్‌ జనరల్‌ను హత్య చేసినందుకు పరిహారంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది.

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తిమంతమైన ఖుద్స్‌ ఫోర్స్‌కు ఖాసీం సులేమానీ నేతృత్వం వహించేవాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఖాసీం హత్యకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇరాన్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 2020లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో సులేమానీ మృతి చెందాడు. ఆయనతో పాటు మరోసైనికాధికారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. దానిపై అప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాక్‌లో ఉన్న అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. అయితే అమెరికావైపు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 

ఇదిలా ఉంటే.. ఖాసీం హత్య తర్వాత టెహ్రాన్‌ కోర్టులో 3,300 దావాలు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు.. ఇరాన్‌కు అమెరికా ప్రభుత్వం 50 బిలియన్ల డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ట్రంప్‌, యూఎస్ ప్రభుత్వంతో పాటు 42 మంది వ్యక్తుల్ని దోషులుగా గుర్తించిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. తమ పౌరుల్ని కాపాడుకోవడం కోసమే అమెరికా ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లోనే మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అందుకే ఆయన్ని హతమార్చాల్సి వచ్చిందని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని