Ebrahim Raisi: అదే డేంజర్‌ బెల్‌!

ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్‌. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్‌.

Updated : 21 May 2024 08:34 IST

పురాతన హెలికాప్టరే రైసీని బలితీసుకుందా?

ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్‌. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్‌. ఈ బలహీన ‘పక్షి’కి ప్రతికూల వాతావరణం ఎదురుకావడంతో చిగురుటాకులా వణికిపోయింది. రెక్కలు తెగి కుప్పకూలింది. రైసీ సహా 8 మందిని బలితీసుకుంది.  

ఏమిటీ హెలికాప్టర్‌? 

  • రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్‌-212గా నిపుణులు గుర్తించారు. దీన్ని అమెరికాకు చెందిన బెల్‌ హెలికాప్టర్‌ (ప్రస్తుతం బెల్‌ టెక్స్‌ట్రాన్‌) కంపెనీ తయారు చేసింది. 
  • 1956లో రూపొందించిన బెల్‌ 205 నమూనా ఆధారంగా బెల్‌-212 తయారైంది. కెనడా బలగాల కోసం సీయూహెచ్‌-1ఎన్‌గా తొలుత దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో రెండు టర్బోషాఫ్ట్‌ ఇంజిన్లను కంపెనీ ఏర్పాటు చేసింది.  
  • 1971 మే నాటికి 50 హెలికాప్టర్లను కెనడా సైన్యం తీసుకుంది. యూహెచ్‌-1ఎన్‌ పేరుతో వీటిని అమెరికాకూ బెల్‌ సంస్థ సరఫరా చేసింది. ఈ లోహవిహంగాలను వియత్నాం యుద్ధంలో ఉపయోగించారు.  
  • ఈ హెలికాప్టర్‌లో మార్పులు చేసి.. వాణిజ్య అవసరాల కోసం ‘బెల్‌ 212’ను సంస్థ అభివృద్ధి చేసింది. ఈ బహుళ ప్రయోజన మధ్యశ్రేణి లోహవిహంగాలను ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఇది సిబ్బంది సహా 15 మందిని మోసుకెళ్లగలదు. 

భాగాలుగా విడగొట్టి.. 

ఇరాన్‌ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను 1979కు ముందు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. తర్వాత అమెరికా ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది. 

  • ఇరాన్‌ విమానయాన, హెలికాప్టర్‌ సంస్థలు.. తమ వద్ద ఉన్న లోహవిహంగాల్లో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి, మిగతావాటికి అమరుస్తున్నాయి. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్‌ తయారుచేస్తోంది. వాటి నాణ్యత ప్రశ్నార్థకం. 
  • ఇరాన్‌లోని అగ్రశ్రేణి విమానయాన సంస్థలు వాడుతున్న విమానాల సగటు వయసు 20 ఏళ్లు. కొన్ని లోహవిహంగాలైతే 30 ఏళ్ల కిందటివి కావడం గమనార్హం. 

గతంలోనూ ప్రమాదాలు..

ఈ హెలికాప్టర్‌ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. 

  • 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్‌కు చెందిన బెల్‌-212.. లూసియానా తీరంలో కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 
  • 2009లో కెనడాలోని న్యూఫౌండ్‌ లాండ్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్‌ ప్రమాదంగా ఇది నిలిచింది. 

ఫలితమిదీ.. 

విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణలో లోపాల కారణంగా 1979 నుంచి ఇరాన్‌లో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

 2000 నుంచి ఇరాన్‌లో 22 విమాన ప్రమాదాలు జరిగాయి. 2003లో.. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌  సిబ్బందితో వెళుతున్న ఐఎల్‌-76ఎండీ విమానం కెర్మాన్‌ నగరం వద్ద పర్వతంపై కూలిపోయింది. ఇందులో 275 మంది దుర్మరణం పాలయ్యారు. 

విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో 

ఇరాన్‌ రక్షణ, రవాణా శాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు మరణించిన ఘటనలూ ఉన్నాయి.   

రాజుగారి హెలికాప్టర్‌ ! 

ఆదివారం కూలిన బెల్‌ 212 హెలికాప్టర్‌ ను 1979 నాటి ఇస్లామిక్‌  విప్లవానికి ముందు ఇరాన్‌  చివరి రాజు షా మహ్మద్‌  రెజా పహ్లావీ హయాంలో సమకూర్చుకొని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. దృశ్య స్పష్టత ఉన్నప్పుడే విహరించేలా దీన్ని రూపొందించారు. అంటే.. తన సీటు నుంచి పరిసరాలను చూడగలిగే సామర్థ్యంపైన ఆధారపడి మాత్రమే పైలట్‌ ఈ హెలికాప్టర్‌ ను నడపగలుగుతారన్నమాట. ఆదివారం నాటి ప్రమాద ఘటనా స్థలిలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్య స్పష్టత చాలా తక్కువగా ఉంది.

స్వయాన పైలట్‌ అయిన రాజు షా మహ్మద్‌ .. అప్పట్లో వాయుసేన బలోపేతం కోసం పెద్ద సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేశారు. వాటిలో అమెరికా నుంచి సమకూర్చుకున్న ఎఫ్‌-14 ఫైటర్‌  జెట్‌లు, ఏహెచ్‌ -1 సూపర్‌  కోబ్రా, చినూక్‌  వంటి హెలికాప్టర్లూ ఉన్నాయి. ఆంక్షల కారణంగా వాటిలో చాలావరకూ  మూలనపడ్డాయి.

ఈనాడు, ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని