Iran–Israel conflict: ఇజ్రాయెల్‌పై దాడులు.. అమెరికాకు ముందే చెప్పాం: ఇరాన్‌

ఇజ్రాయెల్‌ (Israel)పై దాడుల గురించి తాము అమెరికాకు చెప్పామంటూ ఇరాన్‌ వెల్లడించింది. అయితే ఆ విషయాన్ని అగ్రదేశం తోసిపుచ్చింది. 

Published : 15 Apr 2024 17:56 IST

టెహ్రాన్‌: సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ (Israel)పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్(Iran) విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వీటి గురించి తాము ముందే అమెరికా (USA)కు సమాచారం అందించామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హొయీన్‌ అమిరాబ్డోల్లాహియాన్ మీడియాతో అన్నారు. ‘‘పౌర లక్ష్యాలను మేం గురిపెట్టలేదు. వాణిజ్య, జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడి ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకే. మమ్మల్ని రక్షించుకునేందుకు మేం తీసుకున్న చర్య ఇది. దీని గురించి మేం ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చాం. మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పాం’’ అని వెల్లడించారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము ప్రతిస్పందించినట్లు చెప్పారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా స్పందించడం గమనార్హం.

మరోవైపు, ఇరాన్‌తో తమ ఘర్షణ ముగియలేదని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఆ దేశం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరిట ఇరాన్‌తో పాటు ఆ దేశానికి మద్దతిస్తున్న లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలూ పాల్గొన్నాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపించాయి. వాటిని టెల్‌ అవీవ్‌ తిప్పికొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని