ఇరాన్‌ టాప్‌ కమాండర్లు మృతి.. ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌కు హెచ్చరిక!

Iran: డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ ఆరోపించింది. దీనికి ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.

Published : 02 Apr 2024 08:22 IST

డమాస్కస్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ (Iran) రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై సోమవారం జరిగిన గగనతల దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందినట్లు ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) ధ్రువీకరించింది. దీంట్లో సీనియర్‌ కమాండర్లు మొహమ్మద్‌ రెజా జహేదీ, మొహమ్మద్‌ హదీ హజీ రహీమీ ఉన్నట్లు వెల్లడించింది. జహేదీ ఇరాన్‌కు సైనిక సలహాదారుగా వ్యవహరిస్తుండగా.. రహీమీ ఖుద్స్‌ దళాలకు సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.

ఈ దాడి ఇజ్రాయెల్‌ (Israel) పనేనని ఇరాన్‌ (Iran) ఆరోపించింది. ఎఫ్‌-35 యుద్ధ విమానాలతో దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని.. ప్రతిస్పందన తప్పదని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి హుస్సేన్‌ అక్బరీ హెచ్చరించారు. ఇలా ఒక అధికారిక భవనంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం బహుశా ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు.

డమాస్కస్‌లో దాడి, ఇరాన్‌ ఆరోపణలపై ప్రస్తావన లేకుండానే ఇజ్రాయెల్‌ (Israel) దీనిపై ఆచితూచి స్పందించింది. దాడిలో ధ్వంసమైన భవనం రాయబార కార్యాలయం కాదని.. అది ఖుద్స్‌ దళాలకు కేంద్రంగా ఉందని సైనిక అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ అన్నారు. తాజా దాడితో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి తప్పకుండా ప్రతీకార దాడి ఉంటుందని.. దాన్ని ఎప్పుడు? ఎలా? ఎంత తీవ్రతతో చేపట్టాలనేది త్వరలో నిర్ణయిస్తామని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజిర్‌ కనానీ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని