Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆదివారం తూర్పు అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది.

Updated : 21 May 2024 04:00 IST

విదేశాంగమంత్రి సహా మరో ఆరుగురూ..
అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్‌
మోదీ, పలు దేశాల నేతల దిగ్భ్రాంతి
తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌

టెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆదివారం తూర్పు అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వార్తాసంస్థ ‘ఐఆర్‌ఎన్‌ఏ’ ధ్రువీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియన్‌(60), తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్‌ మలేక్‌ రహ్‌మతీ, మరో ఐదుగురు అధికారులు మృతి చెందినట్లు ప్రకటించింది. రైసీ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఇరాన్‌ ప్రభుత్వం ఐదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరుతో పశ్చిమాసియా సంక్షోభంలో చిక్కుకున్న వేళ ఈ మరణాలు ఇరాన్‌కు ఎదురుదెబ్బగానే భావించొచ్చు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ అంశంలో ఇరాన్‌ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీకి.. ఇటు ఇబ్రహీం రైసీ.. అటు హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియన్‌ రెండు కళ్లల్లా వ్యవహరిస్తున్నారు. వీరి మరణం.. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఇరాన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రైసీ సన్నిహితుడికే పగ్గాలు

రైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ (68)ను అయతుల్లా అలీ ఖమేనీ నియమించారు. మొఖ్బర్‌.. ప్రస్తుతం దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే సుప్రీం అధినేత ఆమోదంతో తొలి ఉపాధ్యక్షుడు ఆ పదవిని చేపడతారు. అనంతరం 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరుగుతాయి. రైసీకి అత్యంత సన్నిహితుడిగా మొఖ్బర్‌కు పేరుంది. ఇరాన్‌ ఉప విదేశాంగమంత్రిగా ఉన్న అలీ బఘేరీ ఇక నుంచి పూర్తిస్థాయిలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన వర్జాఘన్‌ ప్రాంతంలో సైనికుల సహాయ చర్యలు

మోదీ.. ఇతర దేశాల అధినేతల విచారం

 రైసీ మృతిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ సహా పలుదేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్‌-ఇరాన్‌ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్‌ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఈ విషాద సమయంలో ఇరాన్‌ ప్రజలకు వెన్నంటి ఉంటామని విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పేర్కొన్నారు. భారత్‌ మంగళవారం సంతాపదినంగా ప్రకటించింది.  

గుర్తించిన తుర్కియే డ్రోన్‌

ప్రమాదం ఆదివారమే జరిగినా ప్రతికూల వాతావరణం, పొగమంచు, దట్టమైన అడవుల కారణంగా ఘటనా స్థలాన్ని ఇరాన్‌ గుర్తించలేకపోయింది.  దీంతో ఇరాన్‌.. తుర్కియే సాయం కోరింది. తక్షణమే స్పందించిన అంకారా.. అకిన్సి డ్రోన్‌ను పంపింది. ఇది రంగంలోకి దిగి కొద్ది గంటల్లోనే కుప్పకూలిన హెలికాప్టర్‌ నుంచి వెలువడుతున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆచూకీని కనుగొంది. దాని నుంచి సమాచారం అందుకొన్న తక్షణమే ఇరాన్‌ దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని అధ్యక్షుడు రైసీ మరణించినట్లు గుర్తించాయి.   

ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియన్‌ 

ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉందా?

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం వేళ హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరియాలో ఇరాన్‌కు చెందిన జనరల్‌ను ఇటీవల ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసి మట్టుపెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందుకు దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్‌.. వందలాది డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. వాటిని టెల్‌ అవీవ్‌ నిలువరించినప్పటికీ.. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రైసీ దుర్మరణం వెనక చిరకాల శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్‌ పాత్రను తోసిపుచ్చలేమనే కథనాలు వెలువడుతున్నాయి.  అయితే రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగానే జరిగిందని ఇరాన్‌ బలంగా నమ్ముతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు