Israel - Hamas Conflict: గాజాలో తీవ్ర సంక్షోభం.. ఆహారం కోసం సరఫరా ట్రక్కులపై దాడులు

గాజాలోని ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి తరపున మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది తెలిపారు. 

Published : 28 Feb 2024 20:28 IST

రఫా: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel-Hamas Conflict) కారణంగా గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అక్కడి ప్రజలు ఆహారం కోసం సహాయక సామగ్రిని తరలిస్తున్న ఐక్యరాజ్యసమితి (UN) ట్రక్కులపై దాడులకు పాల్పడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. గాజాలో సుమారు 2.3 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు యూన్‌ తరపున మానవతా సాయం అందిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర గాజాలో రెండేళ్ల వయసు పిల్లల్లో ప్రతీ ఆరుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. 

‘‘ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా గాజాలో పిల్లలను పోషకాహార లోపం వెంటాడుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. అత్యవసర సహాయం కింద పంపిన పది ట్రక్కుల్లో కొన్నింటిపై ఆహారం కోసం దాడులు జరిగాయి. తనిఖీల పేరుతో మరో రెండు రోజులు ఆలస్యంగా వాటి గమ్యస్థానాలకు చేరాయి. అక్కడి వారి ఆకలి బాధ మా సిబ్బందిని తీవ్ర ఆందోళనకు, నిరాశకు గురి చేసింది. ప్రజావ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం కావడంతో ఆహార పంపిణీ సవాలుగా మారింది’’ అని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కార్ల్‌ స్కౌ తెలిపారు.

ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం.. బైడెన్‌, నెతన్యాహు మధ్య ముదురుతున్న విభేదాలు!

మరోవైపు హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్నవారిని విడిపించాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వారిని విడుదల చేయాలని కోరుతూ బందీల కుటుంబసభ్యులు దక్షిణ ఇజ్రాయెల్‌ నుంచి జెరూసలేం వరకు నాలుగు రోజుల పాదయాత్ర చేపట్టారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఖతార్‌ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మిగిలినవారు విడుదల అయ్యేందుకు ఇరువర్గాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని