Israel Hamas Conflict: పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా.. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు

Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌ హమాస్‌ ఉద్రిక్తతలపై ఉన్న ఆందోళనలను ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధానమంత్రి మోదీ పంచుకున్నారు. వీలైనంత త్వరగా శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.

Updated : 29 Oct 2023 10:40 IST

Israel Hamas Conflict | దిల్లీ: పశ్చిమాసియాలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్‌ ఎల్‌-సిసితో ఫోన్‌లో చర్చించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తెలిపారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదం, హింస, సామాన్య పౌరుల మరణాలపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas Conflict) నేపథ్యంలోనే వారు ఈ మేరకు శుక్రవారం చర్చలు జరిపారు.

పశ్చిమాసియాలో వెంటనే శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించి స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని మోదీ (Modi), ఎల్‌-సిసి పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్తతల (Israel Hamas Conflict) వల్ల ప్రభావితమైన బాధితులకు మానవతా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక కార్యకలాపాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే వచ్చే ముప్పుపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. సామాన్య పౌరుల జీవితాలు, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండనుందో చర్చించినట్లు తెలిపారు.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఆకస్మికంగా దాడి (Israel Hamas Conflict) చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 1,400 మంది మరణించారు. వీరిలో సామాన్యులే అధికమని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైన్యం సైతం హమాస్‌ నియంత్రణలో ఉన్న గాజాపై దాడి చేస్తోంది. ఇటీవలి వరకు వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్‌.. తాజాగా భూతల దాడులనూ ప్రారంభించింది. దీంతో నగర వీధుల్లో ఇరు పక్షాలు ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో తమ పౌరులు వేలాది మంది మరణించినట్లు హమాస్‌ చెబుతోంది.

మరోవైపు గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తీర్మానంలో హమాస్‌ దాడిని ఖండిస్తూ ఎలాంటి ప్రస్తావన లేదని..  అందుకే ఓటింగ్‌కు గైర్హాజరయ్యామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాజాలో మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నాయి. ప్రత్యేకించి పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశాయి. మానవతా సంక్షోభాన్ని తప్పనిసరిగా పరిష్కరించాలని పిలుపునిచ్చాయి. మానవతా సాయం కోసం, ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని