Netanyahu: ‘రెడ్‌లైన్‌ దాటుతున్నారు’: బ్రెజిల్‌ అధ్యక్షుడిపై నెతన్యాహు ఫైర్

Israel-Hamas Conflict: బ్రెజిల్‌ రెడ్‌లైన్ దాటి వ్యాఖ్యలు చేసిందని ఇజ్రాయెల్(Israel) ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. 

Updated : 19 Feb 2024 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్:  గాజాలో మారణహోమాన్ని హోలోకాస్ట్‌తో పోలుస్తూ బ్రెజిల్(Brazil) అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా ఖండించారు. ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్‌లో అధ్యక్షుడు  లులా డ సిల్వా(Luiz Inacio Lula da Silva) హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం గురించి మాట్లాడుతూ.. ‘ఇది యుద్ధం కాదు. మారణహోమం. ఇది ఇరువర్గాల సైనికుల మధ్య జరుగుతోన్న యుద్ధం కాదు. సంసిద్ధులైన ఆర్మీ చేతిలో మహిళలు, చిన్నారులు బలవుతున్నారు. గాజాలోని పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్నది గతంలో ఎన్నడూ చవిచూడలేదు. ఒక్క హిట్లర్ విషయంలో తప్ప. ఆయన యూదులను చంపాలనుకున్నప్పుడు జరిగింది’ అని నెతన్యాహు ప్రభుత్వ చర్యలను ఖండించారు. ( Israel-Hamas Conflict)

బ్రెజిల్‌ రెడ్‌లైన్ దాటుతోందంటూ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఈ యుద్ధం చేస్తోందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. అలాగే లులా డ సిల్వా వ్యాఖ్యలకు నిరసనగా తమ దేశంలోని బ్రెజిల్‌ రాయబారికి ఇజ్రాయెల్‌ సమన్లు ఇచ్చింది. రెండో ప్రపంచయుద్ధంలో యూదులపై నాజీలు సాగించిన నరమేధాన్ని హోలోకాస్ట్‌ అంటారు.

రంజాన్‌ కల్లా బందీలను వదలకపోతే..

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌(Israel)పై ఉగ్రదాడి జరిపి సుమారు 250 మందిని హమాస్ తన చెరలో బంధించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొందరు విడుదలైనా.. ఇంకా పదుల సంఖ్యలో మిలిటెంట్ల వద్దే బందీగా ఉన్నారు. ఈక్రమంలో ఇజ్రాయెల్‌ వార్ కెబినేట్ సభ్యుడు బెన్నీ గాంట్జ్‌ హెచ్చరికలు చేశారు. ‘రంజాన్‌ కల్లా మా బందీలు ఇంటికి చేరకపోతే.. మా పోరాటం అన్నివైపులా తీవ్రమవుతుంది’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇస్లాంను పాటించేవారికి రంజాన్ నెల పవిత్రమైనది. అది మార్చి 10 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని