Israel: హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. వీడియో విడుదల

Israel: గాజాలో హమాస్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం ఆ మిలిటెంట్‌ సంస్థపై విరుచుకుపడుతోంది. తాజాగా బుధవారం ఉదయం మరోసారి వైమానిక దాడులు చేపట్టింది.

Published : 10 Apr 2024 08:07 IST

జెరూసలెం: సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ (Israel) ప్రకటించింది. బుధవారం ఉదయం జరిపిన ఈ వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF)’ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేసింది.

సిరియా భూభాగంపై జరుగుతున్న అన్ని కార్యకలాపాలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐడీఎఫ్‌ తెలిపింది. హెజ్‌బొల్లా బలోపేతం కోసం మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పింది. పరోక్షంగా సిరియా గడ్డ నుంచి హెజ్‌బొల్లా కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని హెచ్చరించింది. గాజాలో హమాస్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌పై (Israel) హెజ్‌బొల్లా పలుసార్లు విరుచుకుపడింది. దీంతో ఐడీఎఫ్‌ ఆ మిలిటెంట్‌ గ్రూప్‌పైనా దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ సోమవారం జరిపిన దాడిలో హెబ్‌బొల్లాలోని ప్రధాన విభాగమైన రాడ్వాన్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ అలీ అహ్మద్‌ హుస్సేన్‌ మృతిచెందాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు