Israel: యూఎన్‌ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌ కింద భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ

గాజాలోని యూఎన్‌ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌ భవనం కింద భారీ సొరంగం గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది.  

Updated : 11 Feb 2024 10:56 IST

గాజా: గాజా (Gaza)లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి (United Nations) ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ హెడ్‌క్వార్టర్స్‌ భవనాల కింద ఉన్న భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్‌ మిలిటరీ (IDF) గుర్తించింది. దీనికి సంబంధించి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వీడియోను పోస్టు చేసింది. తమ కార్యకలాపాల కోసం హమాస్‌ (Hamas) ఈ సొరంగం నిర్మించి దీనికి విద్యుత్‌ సదుపాయం ఏర్పాట్లు చేసుకున్నట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. దీంతో అక్టోబర్‌ 7న హమాస్‌ మారణకాండకు సంబంధించి సదరు ఏజెన్సీకి చెందిన ఉద్యోగుల పాత్రపై ఇజ్రాయెల్‌ చేస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లైంది.   

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ సాగించిన మారణకాండలో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఇజ్రాయెల్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏజెన్సీ కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజారి దాడికి సంబంధించి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న 12 మంది సిబ్బందిని తొలగించారు. వారిపై విచారణ చేపడతామని ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్‌ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సరుకుల సరఫరాను అడ్డుకోవడంతోపాటు దాని పన్ను ప్రయోజనాలను రద్దు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీకి నిధుల మంజూరును నిలిపివేస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. దీంతో ఈ సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి జారుకుంది.  

సొరంగంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ..

మొత్తం 700 మీటర్ల పొడవు గల ఈ టన్నెల్‌ను 18 మీటర్ల లోతులో నిర్మించారు. విద్యుత్‌ సరఫరా కావడానికి ఏర్పాట్లు చేశారు. సొరంగంలో బ్యాటరీలు, విద్యుత్‌ పరికరాలు, ఆయుధాలు, సామగ్రి, గ్రనేడ్లు, ఏజెన్సీ సర్వర్‌ రూమ్‌తో అనుసంధానం అయిన హమాస్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ గుర్తించినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. తాజాగా ఘటనపై యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ స్పందించింది. తమ కార్యాలయం కింద సొరంగం ఉందని, విద్యుత్‌ సరఫరా సాగినట్లు తమకు తెలియదని పేర్కొంది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ చేపడతామని పేర్కొంది. యుద్ధం కొససాగుతుండడం వల్ల దీనిపై దృష్టి సారించలేదంది. 

అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడంతో ఆ దేశానికి చెందిన సుమారు 1200 మంది చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్‌ అప్పటినుంచి గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 27,000కు పైగా మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని