Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌ మొండి పట్టు.. సాధారణ పౌరులే సమిధలు!

Israel Hamas Conflict| హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా శుక్రవారం రఫాలోని రెండు వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 11 మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డారు.

Published : 31 May 2024 15:56 IST

శుక్రవారం దాడుల్లో మరో 11 మంది మృతి

రఫా: అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అగ్రరాజ్యం అమెరికా (USA) మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్‌ (Israel) మాత్రం వెనకడుగు వేయడం లేదు. హమాస్‌ (Hmas) నిర్మూలనే ధ్యేయంగా మొండిగా ముందుకెళ్తోంది. దాడులను తక్షణమే ఆపాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెట్టి.. రఫా నగరంపై (Rafah) లాంఛర్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల మాట అటుంచింతే.. సాధారణ పౌరులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు.

హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా శుక్రవారం రఫాలోని రెండు వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 11 మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. ఆ దేశం వైమానిక దాడులకు పాల్పడుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని పాలస్తీనియన్లు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు సెంట్రల్‌ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన వైమానిక దాడిలో పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రఫా ప్రాంతంలో ఆపరేషన్‌ ఇకముందూ కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. సులభంగా దాడులు చేసేందుకు వీలుగా నగరంలోనే పలు రాకెట్‌ లాంఛర్లు, సొరంగాలను ధ్వంసం చేసే ప్రత్యేక ఆయుధాలను సిద్ధం చేసుకుంది. గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటినుంచి ఆ దేశం ప్రతీకారంతో రగిలిపోతోంది.

ఐదు రోజుల క్రితం రఫాపై ఇజ్రాయెల్‌ చేసిన భీకర వైమానిక దాడిలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. గుడారాలు తగలబడుతున్న దృశ్యాలు, మంటల్లో కాలిపోతున్న మృతదేహాలు, అవయవాలను కోల్పోయిన చిన్నారులకు సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇంత జరిగినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా దాడులను ఉద్ధృతం చేస్తామని ఆ దేశం చెబుతుండంతో.. ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు