Netanyahu Jr: భీకర యుద్ధం వేళ.. ప్రధాని కుమారుడు ఎక్కడ..?

యావత్‌ దేశం యుద్ధం క్షేత్రంలో అడుగుపెడుతున్న వేళ.. ప్రధానమంత్రి నెతన్యహూ (Benjamin Netanyahu) కుమారుడు అమెరికాలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశమయ్యింది.

Published : 26 Oct 2023 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ల (Israel Hamas conflict) మధ్య రెండు వారాలుగా కొనసాగుతోన్న భీకర యుద్ధం మరింత ఉద్ధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గాజాపై భూతల దాడులకు ఉపక్రమించిన ఇజ్రాయెల్‌.. రిజర్వు ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. దాదాపు 3లక్షలకు పైగా రిజర్వు సైనికులు ఇప్పటికే కదనరంగంలోకి దిగారు. ఇలా యావత్‌ దేశం యుద్ధం క్షేత్రంలో అడుగుపెడుతున్న వేళ.. ప్రధానమంత్రి నెతన్యహూ (Benjamin Netanyahu) కుమారుడు మాత్రం అమెరికాలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశమయ్యింది. దీనిపై రిజర్వు సైనికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యహూ కుమారుడు యాయిర్‌ (32).. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుకు సంబంధించి పరువునష్టం కేసులో చుక్కెదురయ్యింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో యాయిర్‌ అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం మియామిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అనేక మంది రిజర్వు సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘విదేశాల్లో ఉద్యోగం, కుటుంబాలను వదిలి దేశం కోసం నుంచి తిరిగి వచ్చాం. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి కుమారుడెక్కడ..?’ అని ఓ సైనికుడు ప్రశ్నించాడు. ‘ఓ ఇజ్రాయెల్‌ పౌరుడిగా మనమందరం ఏకం కావాల్సిన సమయం. ప్రధానమంత్రి కుమారుడితోపాటు దేశంలోని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండాల్సిందే’ అని మరో సైనికుడు గళమెత్తినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలా కొన్ని రిజర్వు సైనిక యూనిట్ల నుంచి ఇటువంటి ప్రశ్నలే వచ్చాయని పేర్కొన్నాయి.

కదనరంగంలోకి 3లక్షల మంది ‘రిజర్వు ఆర్మీ’.. అసలేమిటీ సైన్యం..?

నెతన్యహూ కుమారుడు యాయిర్‌.. థియేటర్‌ విభాగంలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఇజ్రాయెల్‌లో నిర్బంధ సైనిక సేవను గతంలోనే పూర్తిచేసుకున్నాడు. అయితే, ఇజ్రాయెల్‌కు చెందిన నేషనల్‌ యూనిటీ నేత బెన్నీ గాంట్జ్‌తో డానా కాసిడీ అనే మహిళ సామాజిక వేత్త  ప్రేమాయాణం సాగిస్తుందంటూ 2020 ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో యాయిర్‌ పోస్టు చేశాడు. దీంతో ఆమె కోర్టులో దావా వేశారు. ఈ కేసులో యాయిర్‌కు చుక్కెదురయ్యింది. కాసిడీకి 34వేల డాలర్లు చెల్లించాలని నెతన్యహూ కుమారుడిని ఇజ్రాయెల్‌ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడు అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని