Israeli Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు.. రఫాపై ఇజ్రాయెల్‌ ముమ్మర దాడులు

రఫాపై దాడులను తక్షణమే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేసింది. శనివారం కూడా దాడులు కొనసాగించింది.

Published : 25 May 2024 18:59 IST

రఫా: అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) మొట్టికాయలు వేసినప్పటికీ ఇజ్రాయెల్‌ (Israel) తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దక్షిణ గాజాలోని రఫాపై (Rafah) సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలన్న ఐసీజే ఆదేశాలను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేసింది. శనివారం కూడా రఫా నగరంపై తుపాకులతో విరుచుకుపడింది. హమాస్‌ (Hamas) ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై శుక్రవారం 15 మంది న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సైనిక చర్యను వెంటనే ఆపేయాలని ఐసీజే ఆదేశించింది. అంతేకాకుండా గాజాకు మానవతాసాయం అందేలా రఫా క్రాసింగ్‌ను తెరవాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) దర్యాప్తు సంస్థలను, నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని స్పష్టం చేసింది. నెలలోగా తమ ఆదేశాల అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని తెలిపింది. అయితే వాటన్నింటినీ ఇజ్రాయెల్‌ పెడచెవిన పెడుతూ యధావిధిగా దాడులు కొనసాగిస్తోంది.

ఐసీజే ఆదేశాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, వాటిని అమలుచేసే యంత్రాంగాలు మాత్రం లేవు. దీంతో ప్రపంచ న్యాయస్థానం ఆదేశాలు ఇజ్రాయెల్‌పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. అంతేకాకుండా తమ పౌరుల రక్షణ కోసం దాడులు చేయడం తప్పు కాదని, ఈ విషయంలో ఐసీజే అభిప్రాయం సరికాదని ఇజ్రాయెల్‌ నొక్కి చెప్పింది. పాలస్తీనా పౌరులను ఇబ్బంది పెట్టేందుకుగానీ, వారి జీవన పరిస్థితులను చిన్నాభిన్నం చేసేందుకు గానీ తాము సైనిక కార్యకలాపాలు చేపట్టడం లేదని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హనెబ్గీ వెల్లడించారు. ఆ ఆలోచనే తమకు లేదని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య కాల్పుల విరమణ సాధించే దిశగా ఫ్రాన్స్‌ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని