Israel: బందీల కుటుంబాల నుంచి నెతన్యాహుకు నిరసన!

Israel: బందీల విడుదలకు సమయం మించిపోతోందని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడిపించేందుకు నెతన్యాహు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జెరూసలెంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

Published : 01 Apr 2024 09:12 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. జెరూసలెంలోని పార్లమెంట్‌ ముందు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. హమాస్‌ (Hamas) చెరలో ఉన్న బందీలను వెంటనే తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు నినదించారు.

గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 250 మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత యావత్‌ ఇజ్రాయెల్‌ (Israel) ఏకతాటిపైకి వచ్చింది. హమాస్‌పై ప్రారంభించిన యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. కానీ, ఇప్పటికీ పరిస్థితులు ఓ కొలిక్కి రాలేదు. ఇంకా చాలా మంది హమాస్‌ చెరలో బందీలుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు నెతన్యాహు పోరాటానికి మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలను విడిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

నవంబర్‌లో కుదిరిన సంధి మేరకు దాదాపు సగం మంది బందీలను హమాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ, మరింత మందిని తీసుకొచ్చేందుకు మధ్యవర్తులుగా వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. దీంతో బందీల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తమవారు బయటకు రారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వమే అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు.

హూతీల డ్రోన్ల కూల్చివేత..

మరోవైపు ఎర్ర సముద్రంలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హూతీ తిరుగుబాటుదారులకు చెందిన రెండు డ్రోన్లను కూల్చి వేసినట్లు అమెరికా ప్రకటించింది. ఒకటి యెమెన్‌ భూభాగంపై కూల్చగా.. మరొకటి ఎర్ర సముద్రంపై విహరిస్తుండగా దాడి చేసినట్లు తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో సురక్షిత ప్రయాణానికి ప్రతిదాడులు చేయక తప్పడం లేదని అమెరికా సెంట్‌కామ్‌ ప్రకటించింది. దీనిపై హూతీల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని