Israel: యుద్ధం ముగిసిన తర్వాత.. నెతన్యాహు ప్లాన్‌ ఇదేనటా!

యుద్ధం ముగిస్తే.. పాలస్తీనా భూభాగంలో పాలనా పరిస్థితులకు సంబంధించి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఓ ప్రణాళిక రూపొందించారు.

Published : 23 Feb 2024 20:54 IST

జెరుసలేం: హమాస్‌ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తోన్న యుద్ధం (Israel-Hamas Conflict) ఐదు నెలలుగా కొనసాగుతోంది. ఒకవేళ ఈ యుద్ధం ముగిస్తే.. పాలస్తీనా భూభాగంలో పాలనా పరిస్థితులకు సంబంధించి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఓ ప్రణాళిక రూపొందించారు. వెస్ట్‌ బ్యాంక్‌, గాజాతో సహా జోర్డాన్‌ పశ్చిమభాగంలో భద్రతా నియంత్రణ మొత్తం ఇజ్రాయెల్‌ చేతిలో ఉంటుందని ప్రతిపాదించింది. దీనిని ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ ముందు ఆమోదానికి ఉంచారు.

యుద్ధం అనంతరం చేపట్టాల్సిన దీర్ఘకాలిక వ్యూహాలను సిద్ధం చేసిన నెతన్యాహు.. పాలస్తీనాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించడాన్ని తోసిపుచ్చారు. పాలస్తీనియన్లతో పరిష్కారం అనేది రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. అయితే, పాలస్తీనియన్ల వైపు ఎవరు ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.

గాజా-ఈజిప్టు సరిహద్దులో ఇజ్రాయెల్‌ ఉనికి ఉంటుందని నెతన్యాహు ప్రతిపాదించారు. రఫా క్రాసింగ్‌తోపాటు స్థానికంగా స్మగ్లింగ్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈజిప్టు, అమెరికాలకు సహకరిస్తామన్నారు.  గాజాలో శాంతిభద్రతలను కాపాడుతూ హమాస్‌ పాలనను భర్తీ చేసేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని సూచించారు. అయితే, ఉగ్రవాద దేశం లేదా గ్రూపులతో సంబంధం లేనివారితోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు.

ఐరాస నేతృత్వంలోని పాలస్తీనా శరణార్థి ఏజెన్సీని మూసివేయాలని.. దాని స్థానంలో ఇతర అంతర్జాతీయ సహాయ బృందాలను కొనసాగించాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. గాజా నుంచి సైనికులను వెనక్కి రప్పించే (నిస్సైనికీకరణ) అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. ఇందుకు సంబంధించి మధ్యకాలిక లక్ష్యాలను నిర్దేశించారు. అయితే, అవి ఎప్పటినుంచి మొదలవుతాయనే విషయాన్ని వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని